calender_icon.png 21 September, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంజీఎంలో వైద్యుల నిర్లక్ష్యం!

21-09-2025 12:00:00 AM

-రోగికి ‘ఓ’ బదులు బీ గ్రూప్ ఎక్కించిన వైనం

-ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్న డాక్టర్లు

-16న ఆస్పత్రిలో చేరిన బాధితురాలు

హనుమకొండ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): వరంగల్ ఎంజీఎంలో మరోసారి వైద్యుల నిర్లక్ష్య ధోరణి వల్ల దారుణం జరిగింది. నగరంలోని కాజీపేటకు చెందిన జ్యోతి అనారోగ్యంతో ఈనెల 16న ఎంజీఎం ఆస్పత్రిలో చేరింది. ఆమెకు రక్తం తక్కువగా ఉందని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె బ్లడ్ గ్రూప్ ‘ఓ’ పాజిటివ్ నిర్ధారించి రక్తం ఎక్కించాలని నిర్ణయించారు.

అయితే ఈ నెల 17, 18వ తేదీన రెండుసార్లు ‘ఓ’ పాజిటివ్ బదులు ‘బి’ పాజిటివ్ రక్తం ఎక్కించారు. మళ్లీ శుక్రవారం రక్తం కావాలని పరీక్ష నిర్వహించగా, ‘ఓ’ పాజిటివ్ బదులు ‘బీ’ పాజిటివ్ రక్తం ఎక్కించినట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ప్రత్యేక వార్డు కు తరలించి ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ బ్లడ్ బ్యాంక్ రికార్డుల ప్రకారం తప్పు జరిగినట్లు బయటకు పొక్కింది.