21-09-2025 12:43:28 AM
- అనస్తేషియా హైడోస్ తో విషమించిన ఆరోగ్యం
- వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి బలి
- వనస్థలిపురం తన్వీ హాస్పటల్లో ఘటన
ఎల్బీనగర్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న చిన్నారి ప్రాణం బలైంది. వైద్యం కోసం చిన్నారిని తీసుకువచ్చిన తల్లిదండ్రులకు వైద్యులు గర్భశోకం మిగిలిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లికి చెందిన ధ్యానమొయిన శేఖర్, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు. కూతురు నిహారిక (11) గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు 10 రూపాయల నాణెం మింగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన వనస్థలిపురంలోని హుడా సాయి నగర్ కమాన్ వద్ద ఉన్న తన్వీ హాస్పిటల్ కు తీసుకువచ్చారు.
అదే రోజు రాత్రి సర్జరీ చేసిన వైద్యులు నిహారిక మింగిట 10 రూపాయల కాయిన్ ను తొలిగించారు. అనంతరం మరుసటి రోజు ఉదయం (శుక్రవారం) 5 గంటల సమయంలో పేషెంట్ పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత శుక్రవారం సాయంత్రం నిహారిక అస్వస్థతకు గురైంది. వెంటనే శనివారం ఉదయం కుటుంబ సభ్యులు తిరిగి నిహారికను తన్వి హాస్పిటల్ కు తీసుకువచ్చారు. తన కూతురిని కాపాడాలని కోరగా హాస్పిటల్ యాజమాన్యం నిహారికను తిరిగి అడ్మిట్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తాము ఏమి చేయలేమని ఇతర హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇంతలోనే పాపం పసి ప్రాణం గాలిలో కలిసిపోయింది.
అనస్తీషియా హైడోస్ ఇచ్చారని ఆరోపణ
తన్వీ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని నిహారిక తల్లిదండ్రుల రోదనలు పలువురిని కలిచి వేశాయి. 10 రూపాయల నాణెం తొలగించేందుకు అనుభవం లేని డాక్టర్లు అనస్తేషియా డోస్ ఎక్కువగా ఇవ్వడం వల్లనే నిహారిక తీవ్ర అస్వస్థతకు గురైందని పేర్కొన్నారు. తన్వీ హాస్పిటల్ నిర్వాహకుడు రాముపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిహారిక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.