21-09-2025 12:42:58 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : దేవుడి భూములు కాపాడటంలో జాప్యం ఎందుకు జరుగుతుందని రాష్ర్ట అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఆ భూములపై న్యాయ పోరాటం సరైన రీతిలో ఎందుకు జరగడంలేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవుడి భూ ములపై లీగల్ ఫైట్ గట్టిగా చేయాలన్నారు.
శనివారం సచివాలయంలో నిర్వహించిన ఎండో మెంట్ గవర్నమెంట్ ప్లీడర్ల సమావేశంలో మం త్రి సురేఖ పాల్గొని మాట్లాడుతూ దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేవుడి భూము లు కాపాడటంలో లీగల్ టీమ్ పాత్ర చాలా కీలకమైందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. ఎండోమెంటు కేసుల విషయంలో న్యాయవాదులతో ప్రతి ఆరు నెలలకొకసారి సమావేశం పెట్టి స్టేటస్ చెప్పాలని మంత్రి ఎండోమెంటు శాఖ అధికారులను ఆదేశించారు.
ఎండోమెంటు ప్లీడర్ల పనితీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల విషయంలో న్యాయ విభాగం అప్‌డేట్ చేయకపోవడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. కేసుల్లో పురోగతికి సంబంధించిన అంశాలు, జడ్జిమెంట్ కాపీ ఎండోమెం టు శాఖ సెక్రటరీకి అందజేయాలని సూచించారు. ఎండోమెంటు ట్రిబ్యూనల్ అపాయింట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రస్టీలకు సంబంధించిన కేసుల్లో గట్టిగా వాదించాలన్నారు.
ఆర్కియాలజీ డిపార్టుమెంటు వద్ద వివరాలు సేకరించాలని, ఆ సమాచారాన్ని సాక్ష్యంగా తీసుకొని వెళ్లాలన్నారు. అందుకోసం ఒక ఎక్స్‌పర్ట్ కమిటీ నియమించాలని చెప్పారు. ఇట్రిమ్ ఆర్డర్స్ విషయంలో తమ డిపార్టుమెంటును అలర్ట్ చేయకపోతే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎండోమెంటు ఉన్నతాధికారులు లేవనెత్తడంతో వాటిని ఎప్పటికప్పుడు ఎదుర్కొవడానికి ఒక మెకానిజం ఏర్పా టు చేయాలని మంత్రి ఆదేశించారు.
ఎండోమెంటు కేసుల్లోని కంటెప్ట్ ఆఫ్ కోర్టు అంశాలు తీవ్రంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఈ విషయంలో న్యాయ విభాగ టీమ్, వారి కింద వ్యవస్థ సరైన టైంలో ఎండోమెంటు ఉన్నతాధికారులను అలర్ట్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. సివిల్ సప్లయ్ డిపార్టమెంటులో ఉన్న మాదిరిగా ఉండాలన్నారు. కౌంటర్లు వేయడంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దన్నారు. కింది స్థాయి ఈవో లు కూడా అందుకు సహకరించాలన్నారు.
ఎవరైనా సహకరించకపోతే ఎండోమెంటు సెక్రటరీ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాకో లీగల్ ఆఫీసుర్ను నియమించాలని అన్నారు. హైకోర్టుకు కూడా లైజన్ ఆఫీసర్‌ను నియమించాలని, ఈవోల నుంచి ఒకరు ఉండాలని న్యాయ విభాగ టీం సూచించగా మంత్రి అనుమతించారు.
వెంటనే అందుకు సంబంధించిన ప్రపోజల్ తనకి పంపించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎండోమెంటు ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, యాదగిరిగుట్ట ఈవో వెంకటరావు, కమి షనర్లు కృష్ణ ప్రసాద్, కృష్ణవేణి, ఎండోమెంటు శాఖ గవర్నమెంటు ప్లీడర్(జీపీ) బీఎం నాయక్, ఏజీపీ శైలజ, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.