calender_icon.png 4 May, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు జిఎం కు సమ్మె నోటీసు ఇచ్చిన సీఐటీయు

04-05-2025 06:09:36 PM

మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండని పిలుపు...

ఇల్లెందు (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను నిలుపుదల చేయాలని సింగరేణి పరిరక్షణకు కొత్త గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఇల్లందు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇల్లందు జనరల్ మేనేజర్ కృష్ణయ్య(General Manager Krishnaiah)కి సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి మాట్లాడుతూ.. సింగరేణి లో సమ్మె సంపూర్ణంగా జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను నిలుపుదల చేయాలని, దక్షిణాది పరిశ్రమలకు ఆయువుపట్టుగా ఉండి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి అన్నం పెడుతున్న సింగరేణి పరిరక్షణకు  చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా పరిణమించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షించుకోవాలన్నా సింగరేణి సంస్థను రక్షించుకోవాలన్న కార్మికులను కట్టు బానిసలుగా మార్చనున్న లేబర్ కోడ్ లను నిలుపుదల చేయాలన్న ఐక్య పోరాటలే శరణ్యమని మే 20 తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో రాజకీయాలకతీతంగా ప్రతి కార్మికుడు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగే లాగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు సిరాజ్ అహ్మద్, బ్రాంచి కార్యదర్శి ఎండి అబ్బాస్, సీఐటీయు మండల కన్వీనర్ తాళ్లూరి కృష్ణ, సీనియర్ నేత వరంగంటి రాజ మొగిలి తదితరులు పాల్గొన్నారు.