మూకుడు లేదా గిన్నె ఆకారంలో తయారుచేసిన చర్మ వాద్యాలు చాలానే ఉన్నాయి. వీటిలో చిన్న, పెద్ద సైజులు కనుపిస్తాయి. గోండీ ఆదివాసులు ఇలాంటి దానిని ‘తుడుం’ అంటారు. బంజారాలు, మథురాలు కూడా నగారా అనే అంటారు. దీనినే దుందుభి అని ప్రాచీనకాలంలో పిలిచేవారు. ఈ నగారా కిందివైపు చిన్నగా ఉంటుంది. పైవైపు చాలా పెద్దగా ఉంటుంది. పైన చర్మం కప్పి ఉంటుంది. దీనిని కర్రతో, చేతులతో వాయిస్తారు.
ఈ వాద్యాన్ని మొదట కర్రతో చేసేవారు. ఆ తరువాత ఇనుము, ఇత్తడి, కంచుతో చేయబడుతున్నది. ఈ వాద్యం భారతదేశంలోని చాలా ప్రాంతాలలో వాడుకలో ఉంది. అరమీటరు నుంచి రెండు మీటర్ల పొడవు ఉండే నగారాలు ఉన్నాయి. వీటిని భేరీలు అని పిలుస్తారు. వీటి ధ్వని సంగీతంలో ఉపయోగపడదు. కాని కొన్ని రకాల పూజలు, పండుగులలో, ప్రత్యేక సందర్భాలలో దీనిని మోగిస్తారు.
లోగడ యుద్ధ ప్రారంభంలో సంసిద్ధత కోసం మోగించేవారు. శత్రువు గుండెలు దడదడలాడించే రీతిలో దీనిని కొట్టేవారు. ఒక స్థలం నుండి మరో దూరస్థలానికి సంకేతరూపంగా ఈ ధ్వనిని వాయించేవారు. ఇప్పటికీ బంజారాలు, గోండులు, గొత్తికోయలు, మథురాలు నగారాని వాడతారు.