03-11-2025 01:52:46 AM
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ‘చేయి’జారుతోందా..? ప్రజా వ్యతిరేకత, ప్రతికూల పరిస్థితులు అదే సూచిస్తున్నాయా? బీసీ నినాదం పనిచేయడం లేదా? అందుకే సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారా? రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు.. వరాల హామీలు..ఇవేమీ పనిచేడడం లేదా? బీఆర్‌ఎస్ పార్టీనే పై ‘చేయి’ సాధిస్తోందా? అనే ప్రశ్నలకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే అవుననే స మాధానం వినిపిస్తోంది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, పత్రిపక్ష బీఆర్‌ఎస్, బీజే పీ మధ్య హోరాహోరీ పోరు అన్నట్లుగా సాగుతున్నా.. అధికార పార్టీ నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. క్షేత్ర స్థాయిలో ప్రచారంలోకి వెళ్లిన నాయకులకు నియోజక వర్గ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్‌కు గడ్డు కాలమే..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర క్యాబినెట్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మె ల్సీలు, పార్టీ సీనియర్లే కాకుండా వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలను తీసుకొచ్చి జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేయిస్తున్నారంటేనే.. అక్కడ అధికార కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు స్పష్టమవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది.
సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే రెండో రోజులు నియోజక వర్గంలోని వివిధ డివిజన్లలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు పెట్టడం, ఇద్దరు మంత్రులకు ఒక డివిజన్ ఇన్‌చార్జ్జిగా నియమించడం, 200 ఓట్లకు ఒకరికి బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే అధికార కాంగ్రెస్‌కు గడ్డుకాలం మొదలైందని చర్చ ప్రజల్లో జరుగుతోంది. అంతే కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి మరో రెండు రోజులు రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించడం, ఆ తర్వాత రెండు రోజుల బైక్ ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతే కాకుండా మంత్రులు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎం తన నివాసంలో ఆదివారం మంత్రులతో లంచ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. పార్టీ ఎక్కడెక్కడా వీక్‌గా ఉంది, ఎక్కడా బలంగా ఉందనే సమీక్ష నిర్వహించడం నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఉండడమే కారణమని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.
కుల సంఘాలతో సమావేశాలు..
ఇదిలా ఉంటే, కుల సంఘాలతోనూ అధికార కాంగ్రెస్ సమావేశాలు నిర్వహిస్తోంది. కమ్మ సామాజిక వర్గం ఓట్ల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, బీసీల ఓట్ల కోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇతర నాయకులు బీసీ ప్రచారం ఎత్తుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీసీ, మన బీసీను గెలిపించుకుందాని ప్రచారం చేస్తున్నారు.
అంటే అభివృద్ధి, సంక్షేమ ప్రచారానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదని, బీసీ నినాదంతో బయటపడాలనే ఆలోచనతో ఉన్నారు. అందులో భాగంగానే ఆదివారం కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మన బీసీని గెలిపించుకుందామని ప్రతిజ్ఞ చేయించడం గమనార్హం. నియోజక వర్గంలో ఏడు డివిజన్లలోని 70 బస్తీలలో మాదిగ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారని గుర్తించారు. మాదిగల ఓట్లను హస్తగం చేసుకునేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు బాధ్యతలను అప్పగించారు.
ముస్లిం మైనార్టీ ఓట్లపై గంపెడాశలు..
ఇక ముస్లిం, మైనార్టీల ఓట్లపై గురిపెట్టిన కాంగ్రెస్.. మజ్లిస్ పార్టీ మద్దతుపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నది. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం కూడా మైనార్టీ ఓట్ల కోసమేననే ప్రచారం ఉంది. రాష్ట్ర క్యాబినెట్‌లో మైనార్టీలకు మొదటిసారి స్థానం లేదని బీఆర్‌ఎస్ నుంచి విమర్శలు రావడం.. దాంతో కాంగ్రెస్ పార్టీ చేయించిన వివిధ సర్వేలలో ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్‌కు అనుకూలంగా తేలడంతోనే.. అప్పటికప్పుడు అజా రుద్దీన్‌కు మంత్రి ఇచ్చారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మొన్నటీ వరకు ముగ్గురు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమించినా.. వారు క్షేత్ర స్థాయిలోకి వెళ్లకుండా డివిజన్ల వారీగా అందుబాటులో ఉన్న నాయకులతో తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించడం వెళ్లిపోవడం జరిగిందనే వాదన పార్టీలో వినిపిస్తోంది.
అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. ఎంఐఎం కినుక
అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో మజ్లిస్ పార్టీ కినుక వహించినట్లుగా తెలుస్తోంది. దీంతో మొదటి నుంచి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లుగా కనిపించిన ఎంఐఎం.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు అంతర్గతంగా మద్దతు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. 2023లో జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ చేతిలో ఓటమి చెందారు. ఇప్పుడు గోపినాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో అజారుద్దీన్ కూడా టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే అజారుద్దీన్‌కు కాంగ్రెస్ అభ్యర్థి అయితే తాము మద్దతు ఇవ్వబోమని ఎంఐఎం స్పష్టం చేయడంతోనే.. జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ తప్పించి.. నవీన్ యాదవ్‌కు ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబతున్నాయి. ఇప్పుడు ఏకంగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై మజ్లిస్ పార్టీ ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది.