03-11-2025 01:44:57 AM
షాద్‌నగర్, నవంబర్2 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శైలజ అక్రమాలు, వేధింపులు భరించలేక విద్యార్థినులు షాద్‌నగర్ చౌరస్తాలో మెరుపు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. విద్యార్థులను అదుపులోకి తీసుకొని ఆందోళన విరమింప జేసేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో వారితో ఓ మహిళా కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగి, ఓ విద్యార్థినిపై చేయి చేసుకున్నారు. దీంతో మిగతా విద్యార్థినులు ఆగ్రహానికి గురై మహిళా కానిస్టేబుల్‌పై తిరగబ డ్డారు.
న్యాయం చేయాలని వచ్చిన తమనే కొడతారా అని విద్యార్థినులు నిలదీశారు. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పా రు. కొంతమంది విద్యార్థినులను పోలీసులు బలవంతంగా వాహనంలో ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్లారు. విద్యార్థుల ఆం దోళన నేపథ్యంలో పై అధికారుల ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమ శాఖ జోనల్ చైర్మ న్ నిర్మల, స్థానిక ఏసిపి లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్‌కుమార్ కళాశాలకు వెళ్లి, వేర్వేరుగా విద్యార్థినులతో మాట్లాడి సమస్య లు తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ శైలజ..
తమ నుంచి ఫీజులు అనైతికంగా వసూలు చేస్తున్నదని, వంట సరుకులు బయటకి తరలిస్తున్నదని, తమకు పెట్టే భోజనానికి సంబం ధించి ఇబ్బందులకు గురి చేస్తున్నదని, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. విద్యార్థుల సమస్యల పట్ల ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించాలని అదేవిధంగా వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాలని విద్యార్థులు రోడ్లపైకి రావడం మంచి పరిణామం కాదని పోలీసులు సంబంధిత శాఖ అధికారులకు తెలియజేశారు.
పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్యేక వాహనాల్లో కళాశాలకు తరలించిన విద్యార్థినులు కూడా కళాశాల లోపటికి వెళ్లకుండా బయట బైఠాయించారు. ఈ సందర్భంగా మరోసారి సంబంధిత శాఖ అధికారులు అదేవిధంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. ఈ సంఘటనపై విచారణ కమిటీ నియమించి ఉన్నతాధికారులకు వాస్తవాలు తెలియజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.