calender_icon.png 25 August, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో వర్గ పోరు?

25-08-2025 12:20:58 AM

-చిట్యాల ఇన్నాళ్లు రెండు వర్గాలే.. 

-ప్రస్తుతం మరో వర్గం..?

-రోజురోజుకు పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్..

-స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపెనా..?

-ఇప్పటికైనా జిల్లా పెద్దలు దృష్టి సారించి చక్కదిద్దేనా..!

చిట్యాల,ఆగస్టు 24 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో గత కొన్నాళ్ళుగా వర్గ విభేదాలు కనిపిస్తున్నాయి.గత కొంతకాలంగా ఎవరికి వారే యమునా తీరు అన్న చందగా నాయకుల తీరు ప్రతిపక్షాలకు కలిసి వస్తుందనే ఆరోపణలు చర్చనీయాంశంగా  మారుతున్నాయి.అయితే గడిచిన రెండు ఏళ్లుగా రెండు వర్గాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికి,ఒకరిపై ఒకరు అంతర్గతంగా విమర్శలు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో మరొక వర్గం తయారయ్యి చిట్యాల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తిగా చీలికలుగా మారుతున్నాయన్న ఆరోపణలు మరోవైపు బలంగా వినిపిస్తున్నాయి. ఇదంతా రానున్న జెడ్పిటిసి,ఎంపిటిసి,స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిపక్షాలకు కలిసివచ్చే అంశంగా మారుతుందని రాజకీయ మేధావులు,ప్రజలు చర్చించుకోవడం ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్ గా మారింది.

స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపేనా?

రాష్ర్టవ్యాప్తంగా సర్పంచుల పదవి కాలం ముగిసి దాదాపుగా మూడు సంవత్సరాలు పూర్తయ్యింది.ప్రస్తుతం అందరి చూపు స్థానిక సంస్థల,ఎంపిటిసి,జెడ్పీటిసి ఎన్నికలపై ఉండగా మా నాయకుడు,అంటే మా నాయకుడికే టికెట్ వస్తుందని అంగులు ఆర్భాటాలతో చర్చించుకోవడం గమనారంగా మారుతుంది.ఇప్పటికైనా కళ్ళు తెరిచి సమన్వయం చేయకపోతే రోజు రోజుకు చిట్యాలలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందనే విమర్శలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

అయితే పార్టీలో తప్పులకు తావివ్వకుండా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే అనేక సందర్భాల్లో చెప్పారు.అయినా కొందరి తీరు మారడం లేదని కొంతమంది కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నమాటలు బలంగానే వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ జిల్లా పెద్దలు చిట్యాల కాంగ్రెస్ నాయకత్వంపై దృష్టి సారించి వర్గ విబేధాలు లేకుండా చక్కదిద్దాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.