calender_icon.png 25 August, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిపెడపై ప్లాస్టిక్ పడగ

25-08-2025 12:22:17 AM

ప్లాస్టిక్  నిషేధంపై చర్యలేవి?

మరిపెడ, ఆగస్టు  (విజయ క్రాంతి): దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించినప్పటికీ మరిపెడ మున్సిపాలిటీలో మాత్రం యదేచ్చగా ప్లాస్టీక్ వినియోగిస్తున్నారు. దీనితో పట్టణంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ భూతం పడగవిప్పుతోంది. దైనందిక జీవనంలో ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. తినే ఆహారం, తాగే చాయ్ సహా అన్ని కవర్లలోనే మోసుకెళ్ళడం నిత్య కృత్యంగా మారింది. అడ్డూ అదుపు లేకుం డా పోతున్న ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల పర్యావరణానికి పెను ప్రమాదం ఏర్పడింది.

భవిష్యత్తు తరాల మనుగడకు ముప్పుగా మారిన ప్లాస్టిక్ ను నియంత్రించడంలో అధికార యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తున ్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోవడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు ప్లాస్టిక్ నిర్మూలన పెద్ద సమస్యగా మారింది. ఎక్కడపడితే అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలతో పట్టణం కంపుగా మారింది. పశువులు కూడా ప్లాస్టిక్ వస్తువుల్లో ఉన్న ఆహార పదార్థాలను తింటూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నాయి. 

తూతూ మంత్రంగా తనిఖీలు 

మరిపెడ పట్టణంలో నిర్దేశిత  ప్రమాణం ఉన్న ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియో గించాల్సి ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా నిర్దేశిత ప్రమాణానికి అనువుగా లేని ప్లాస్టిక్ కవర్లను యదేచ్ఛగా వినియోగిస్తున్నారు. నిర్దేశిత ప్రమాణాలను అమలు చేయడంలో మున్సిపల్ అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్లాస్టిక్ కవర్లను నియంత్రిస్తున్నామని చెప్పుకోవడానికే అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్పెషల్ డ్రైవ్ పేరుతో ఏదో నాలుగు రోజులు హడావిడి చేసి ఆ తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం ఇటీవల విపరీతంగా పెరిగిపోయినట్లు విమర్శలు వస్తున్నాయి. నిత్యావసర సరుకుల నుంచి తినే ఆహార పదార్థాల వరకు అన్నింటికీ ప్లాస్టిక్ కవర్లే దిక్కయ్యాయి. ఫలితంగా పట్టణ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీలు ప్లాస్టిక్ కవర్లతో నిండిపోతున్నాయి. ఆహార వ్యర్ధాలను కవర్లలో పెట్టి పాడేయడంతో వాటిని తిని పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మరిపెడ పట్టణంలో ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేయకపోతే ప్లాస్టిక్ భూతం మరిపెడ పట్టణాన్ని కబలించే ప్రమాదం ఏర్పడిందని ప్రజలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.