06-08-2024 12:00:00 AM
మరికొద్ది రోజుల్లో గణేశ్ వేడుకలకు దేశం సిద్ధమవుతున్నది. పర్యావరణానికి నష్టం చేకూర్చే పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) విగ్రహాల తయారీని ఇప్పట్నించే ప్రభుత్వాలు అడ్డుకోవాలి. మెగ్నీషియం, పాస్ఫరస్, డైహైడ్రేట్స్, జిప్సమ్, క్యాల్షియం సల్ఫేట్ వంటివాటిని బాగా వేడి చేయగా వచ్చే మిశ్రమమే ‘ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్’. దీనిని విగ్రహ నమూనాకు అనుగుణంగా తయారుచేస్తారు.
వీటిని ఆకర్షణీయంగా మార్చే క్రమంలో వాడే ప్రమాదకరమైన రంగులలో క్రోమియం, ఆర్సినిక్, కర్బనం వంటి మూలకాలను ఉపయోగిస్తారు. ఇవన్నీ నీటి కొలనులు, చెరువులలో వెంటనే కరగవు. నీటిని కలుషితం చేసే ఈ రసాయనాలవల్ల లోహాల సాంద్రత పెరిగి చేపలు వంటి జలచరాల ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. అలా పర్యావరణ సమతుల్యత దెబ్బతినే పరిస్థితులు సంభవిస్తాయి.
దాంతోపాటు పీవోపీ విగ్రహాలు కరిగిన తర్వాత అవి నీటి అడుగున పొరలా ఏర్పడుతాయి. ఇదికూడా నీటిని భూమిలోకి ఇంకనివ్వదు. దీంతో భూగర్భజలాల నిలువ తగ్గుతుంది. ఈ దృష్ట్యా మట్టి విగ్రహాల వాడకం పట్ల ప్రజలలో మరింత చైతన్యం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ వేత్తలు, బుద్ధిజీవులు కోరుతున్నారు.
మట్టి విగ్రహాలతో కలిగే లాభాలపై ప్రచారం చేయడంతోపాటు పీవోపీ విగ్రహాలవల్ల కలిగే నష్టాలను ప్రభుత్వం, సామాజిక కార్యకర్తలు ప్రచారం చేయాలి. పీవోపీ విగ్రహాల తయారీని నేరంగానూ ప్రకటించాలి. అమ్మక దశలోనూ ఈ విగ్రహాలను అడ్డుకోవాలి.
కె.బాపురావు