15-09-2025 01:10:30 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను ఓ విశ్వనగరంగా, పెరుగుతున్న జనాభాకు అనుగు ణంగా సర్వ హంగులతో తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక విజనరీగా, నగరాభివృద్ధే అజెండాగా ముందుకు సాగుతున్నారని, ఈ అభివృద్ధి యజ్ఞం నిరంతరాయంగా కొనసాగేందుకు జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ, జయప్రకాష్ నగర్ కాలనీ, ఇంజనీర్స్ కాలనీలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయా లనే పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధి, పరిశుభ్రమైన తాగునీటి సరఫరా, ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థ, పటిష్టమైన శానిటేషన్ వంటి కార్యక్రమాలతో ప్రతి కాలనీని ‘క్లీన్ అండ్ గ్రీన్’గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తుమ్మల స్పష్టం చేశా రు.
హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే, ప్రజల ఆశీస్సులు ఎంతో అవసరమని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ సంగీత, ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.