27-09-2025 07:35:26 PM
హైదరాబాద్: శిల్పాకాల వేదికలో గ్రూప్-1 విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-1 విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, మీరే తెలంగాణ భవిష్యత్ అని.. మీరు తెలంగాణ కుటుంబంలో భాగస్వాములు అని తెలిపారు. తెలంగాణ గడ్డకు ఓ చరిత్ర, పౌరుషం ఉన్నాయని.. కొందరు ఒక కుటుంబం కోసమే తెలంగాణ అని భ్రమపడ్డారని పేర్కొన్నారు. కాలం కలిసి వచ్చి.. గెలిస్తే తాము కారణజన్ములం అనుకున్నారని.. విశ్వాసంతో ప్రజలు అధికారమిస్తే.. విశ్వాసఘాతకులుగా మారారని అన్నారు.
3 లక్షల మందితో పోటీ పడి.. 562 మందితో ఒకరిగా మీరు నిలిచారని, నిజామాబాద్ ఎన్నికల్లో ఓడినా కూడా కవితకు రాజకీయ పదవి ఇచ్చారని తెలిపారు. పదేళ్లలో గ్రూప్-1 నిర్వహించలేదంటే.. అంతకంటే నిర్లక్ష్యం ఉంటుందా..? శ్రీకాంతాచారీ సహా ఎందరో యువకులు ప్రాణత్యాగం చేసింది దేనికోసం..? అని విమర్శించారు. గతంలో ప్రశ్నపత్రాలు పల్లీబఠాణీల్లా జిరాక్స్ సెంటర్లలో అమ్మారని, టీజీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రం కాదు.. తెలంగాణ పునర్మిర్మాణ కేంద్రం అని సీఎం పేర్కొన్నారు. నియామకాలు ఆపేందుకు కొందరు ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఒక్కో గ్రూప్-1 పోస్టును రూ.3 కోట్లకు అమ్ముకున్నామని ఆరోపించారని అన్నారు.