01-05-2025 02:59:00 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య పరిపాలన వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏర్పడ్డ లోటు వల్లే సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నామని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఇచ్చిన తులం బంగారం హామీ నెరవేర్చలేక పోతున్నామని, ఆర్థిక పరిస్థితి కుదురుకున్న తర్వాత ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలన్నీ పూర్తిస్థాయిలో అమలు చేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని 49 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను, సీఎంఆర్ ద్వారా నూట అరవై ఐదు మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.44.82 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. నిలువ నీడలేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, పేదల గృహాలకు ఉచితంగా నెలకు 200 యూనిట్ల విద్యుత్ సరఫరా, రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ, ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల పెంచి పేదల ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా కార్యక్రమాలను అమలు చేస్తుంటే గిట్టని ప్రతిపక్ష పార్టీల నాయకులు దుష్ప్రచారానికి దిగుతున్నారని ఆరోపించారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసేలా ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ 8328473007 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దూరప్రాంతాల నుంచి ప్రజలు రాకుండా నేరుగా ఫోన్ నెంబర్కు తమ సమస్యను చెప్పి పరిష్కరించుకోవచ్చని తెలిపారు.