01-05-2025 04:37:11 PM
బాన్సువాడ (విజయక్రాంతి): గురువారం నాడు బాన్సువాడ పట్టణంలోని సిపిఐ కార్యాలయం ముందు కార్మిక వర్గ పోరాట దినం అయినా మే డే ను సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్, తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాస్ రాములు మే డే జెండాను ఎగరవేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆనాడు కార్మికులు ఎనిమిది గంటల పని దినం కావాలని, పనికి తగ్గ వేతనం చెల్లించాలని, వెట్టి చాకిరిని నిర్మూలించాలని కార్మికులను యంత్రాలగా కాకుండా మనుషులాగా చూడాలని డిమాండ్లతో 1886వ సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో సమ్మె చేస్తున్న కార్మికులపై యజమాన్యాలు పోలీసులతో కార్మికులపై తుపాకీతో కాల్పులు జరపడం వలన ఎంతోమంది అమరులయ్యారని వారి రక్తంతో తడిసిన గుడ్డలతోనే కార్మికులు ఎర్రజెండా ఎగిరేసారని ఆయన తెలిపారు. కార్మిక వర్గ పోరాట ఫలితమే కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయని ఆయన తెలిపారు.
ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను ఖాలరాస్తుందని ఆయన విమర్శించారు. మే డే స్ఫూర్తితో కార్మికుల చట్టాలను కాపాడుట కోసం కార్మికులు ఐక్యంగా ఉండి ఉద్యమాలకు సిద్ధంగా కావాలని ఆయన తెలిపారు. ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి డి శంకర్ మాట్లాడుతూ... కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటాలు చేస్తేనే వారి యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. పాలకులు మన సమస్యలను పట్టించుకోరని కార్మిక వర్గం ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తోటపల్లి శ్రీనివాస్, శివాజీ, రాజు, కుమార్ దేవాంగ, కమ్మరి రాములు, కొత్త సాయిలు, గంపల సాయిలు,ఒడ్డు సాయిలు, ఓ ల్లెపు గంగాధర్, మొగులయ్య, హనుమాన్లు, కృష్ణ, పోశెట్టి, నాగమణి, రాపర్తి సాయిలు, పుట్టి సాయిలు తదితరులు పాల్గొన్నారు.