29-07-2024 12:22:30 PM
విద్యుత్ అంశంలో న్యాయవిచారణ కోరిందే బీఆర్ఎస్
యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే.. హైదరాబాద్ ఆదాయం పెరిగింది
తెలంగాణను చీకట్ల నుంచి కాపాడింది జైపాల్ రెడ్డి
హైదరాబాద్: విద్యుత్ అంశంలో న్యాయవిచారణ కోరిందే బీఆర్ఎస్ సభ్యులేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం శాసనసభలో పద్దులపై చర్చ కొనసాగుతోంది. జగదీశ్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నట్లు మాట్లాడుతున్నారని సీఎం ఎద్దేవా చేశారు. చత్తీస్ గఢ్ విద్యుత్ కోనుగోలు యాదాద్రి పవర్ ప్లాంట్ పై న్యాయవిచారణ జరుగుతోందన్నారు. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపంలో జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విచారణ కమిషన్ ముందు వాదనలు వినిపిస్తే బీఆర్ఎస్ సభ్యుల నిజాయితీ బయటకు వచ్చేదని తెలిపారు. న్యాయవిచారణ కోరిందీ వాళ్లే.. వద్దంటున్నది వాళ్లే అని చమత్కరించారు. విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్ ను సాయంత్రం నియమిస్తామన్నారు.
చంద్రబాబు హయాంలోనే 24 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. విద్యుత్ కోతలు ఉండకూడదని రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వ్లల్లే హైదరాబాద్ కు ఆదాయం పెరిగిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. విద్యుత్ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్ విభజన జరిగేలా జైపాల్ రెడ్డి చేశారు. విభజన చట్టంలో లేని స్పీకింగ్ ఆర్డర్ ను విద్యుత్ విషయంలో తెలంగాణకు జైపాల్ రెడ్డి ఇప్పించారని చెప్పారు. జైపాల్ రెడ్డి కృషి వల్ల వినియోగం ఆధారంగా తెలంగాణకు 54 శాతం వచ్చేలా విద్యుత్ విభజన జరిగిందన్నారు. ఉత్పత్తి, సామర్థ్యం ప్రకారం 36 శాతం తెలంగాణలో, 64 శాతం ఏపీలో ఉందని వెల్లడించారు. విభజన చట్టంలో తెలంగాణకు 36 శాతం, ఏపీకి 64 శాతం విద్యుత్ వచ్చేలా ఉందన్నారు. తెలంగాణను చీకట్ల నుంచి కాపాడింది జైపాల్ రెడ్డి. సోనియా గాంధీ దయ, జైపాల్ రెడ్డి కృషి వల్ల రాష్ట్రం విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కిందన్నారు. విద్యుత్ పై విచారణ కొనసాగించాలని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.