14-07-2025 06:33:21 PM
సూర్యాపేట: తిరుమలగిరిలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించారు. పర్యటన అనంతరం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. రేషన్ కార్డు పేదవాడి ఆకలి తీర్చే ఆయుధం అని సీఎం పేర్కొన్నారు. నల్గొండ చరిత్రనే.. తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదని అన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం.. గుర్తింపు అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. గోదావరి నీళ్లు ఇవ్వలేదు.. సీఎం వస్తే అడ్డుకుంటానంటున్నారని అన్నారు. గతంలో 3 రోజులు అవకాశమిస్తే తుంగతుర్తికి జలాలు తెస్తామని అన్నారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తేలేదని తెలిపారు. గ్లాసులో సోడా పోసినట్లు కాదు.. తుంగతుర్తికి నీళ్లు తేవడమంటే' అని తెలిపారు.
దొర ముందు చేతులు కట్టుకుని గ్లాసులో సోడా పోయాడమే నీకు తెలుసు.. సొంత మండలానికి ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసులు, పీఎస్ తెచ్చుకోలేదని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా పేదలకు రేషన్ కార్డు, సన్నబియ్యం ఆలోచన రాలేదని, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తే రేషన్ షాపుల వద్ద ప్రజలు బారులు తీరారని అన్నారు. రూ. 2 లక్షలు తీసుకున్న రైతులకు ఆగస్టు 15న రుణవిముక్తి ఉంటుందని, 25.55 లక్షల మందికి రూ. 21 వేల కోట్లు ఆగస్టు 15న జమచేస్తామని సీఎం వెల్లడించారు. వ్వవసాయం దండగ కాదు.. పండుగ అని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చామని, దేశం తలెత్తుకునేలా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 21 వేల కోట్లు ఇస్తున్నామని, మహిళలకు 600 బస్సులు కొనిచ్చి యజమానులను చేస్తున్నామని అన్నారు.