14-07-2025 11:45:51 PM
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్..
చేవెళ్ల: తాము గోశాలకు వ్యతిరేకం కాదని, అయితే దాని కోసం పేదల భూములు గుంజుకుంటామంటే ఊరుకునేది లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) హెచ్చరించారు. సోమవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్కెపల్లిలో గోశాల బాధితులు చేపట్టిన రిలే దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 ఏండ్ల కింద అప్పటి ప్రభుత్వాలు వ్యవసాయానికి యోగ్యంగా లేని రాళ్లు, గుట్టలను, తొండలు గుడ్లు పెట్టని భూములను పేదలకు ఇచ్చి చేతులు దులుపుకుంటే... ఇప్పటి ప్రభుత్వం అవే భూములను గుంజుకొని పేద కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయని మండిపడ్డారు.
ఎలాంటి ప్రభుత్వ భూమి అయినా 12 ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటూ ఉంటే వారికి పట్టా ఇవ్వాలని చట్టమే చెబుతోందని, 50 ఏళ్లు నుంచి బోర్లు వేసుకుని, బావులు తవ్వుకుని, గుట్టలను సాగు చేసుకుని సేద్యం చేసుకుంటున్న రైతుల భూములు గుంజుకోవడం ఏంటని ప్రశ్నించారు. అది కూడా ఎకరాకు కేవలం 300 గజాలు ఇస్తామనడం సరికాదని మండిపడ్డారు. రేవంత్ సర్కారు పేద రైతుల పట్ల కర్కశంగా వ్యవహరించడం మానుకొని, గోశాలకు మరోచోట భూమి కేటాయించాలని సూచించారు. ఎన్కెపల్లి రైతులకు బీజేపీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నేతలు అందె బాబయ్య, ఎల్లని వెంకటేష్ గౌడ్, గున్నాల గోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, ప్రభాకర్ యాదవ్, రైతులు సికిందర్, డప్పు రమేష్, ఈశ్వర్ తో పాటు బాధిత రైతులందరూ పాల్గొన్నారు.