14-07-2025 11:53:06 PM
కరీంనగర్ (విజయక్రాంతి): రోడ్లు, ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు పై నగరపాలక సంస్థ స్పెషల్ డ్రైవ్ చేపట్టిందని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్(Commissioner Praful Desai) అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో సోమవారం రోజు టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ పోలీసు అధికారులు, డిఆర్ఎఫ్, పారిశుధ్య అధికారులు సిబ్బందితో కలిసి కమీషనర్ ఎంక్రోజ్ మెంట్స్ పై డ్రైవ్ ను ప్రారంభించారు. నగరంలోని తెలంగాణ చౌక్(గీతాభవన్ చౌరస్తా) నుండి పద్మానగర్ వరకు రోడ్లు, ఫుట్ పాత్ లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న ఆక్రమణలను తొలగించి వేశారు. ఫుత్ పాత్ లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేయరాదని దుకాణదారులను కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.... నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారుల్లో రోడ్లు, ఫుట్ పాత్ ఎంక్రోమెంట్ల తొలగింపును నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు.
పాదచారులకు, వాహానదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. రోడ్లు, ఫుత్ పాత్ ఆక్రమణలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని... దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆక్రమణలను తొలగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఒక రహదారిలో డ్రైవ్ చేపట్టి ఎలాంటి ఆక్రమణలు లేకుండా తొలగించేలా టౌన్ ప్లానింగ్, డిఆర్ఎఫ్ పారిశుధ్య అధికారులు చర్యలు తీస్కోవాలని ఆదేశించారు. వాహానదారులకు, పాదాచారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా దుకాణాదారులు తమ షాపుల పరిదిలోనే వ్యాపార కార్యకలాపాలు చేస్కోవాలని సూచించారు. రోడ్లు, ఫుట్ పాత్ లు ఆక్రమించి వ్యాపారం చేసే షాపులకు నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని తెలిపారు. నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాకరించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపి బషిరోద్దిన్, ఏసిపిలు, శ్రీధర్, వేణు, టీపిఎస్ రాజ్ కుమార్, సంధ్య, తేజస్విని, టీపిబివో లు సాయి చరణ్, నవీన్, నధియా, సాయి కిరణ్, ఖాధర్, ట్రాఫిక్ సిఐలు, డిఆర్ఎఫ్ పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.