14-07-2025 11:40:24 PM
డాక్టర్, ఇన్స్టా రీల్స్ యువతి మధ్య ప్రేమ!
భార్య ఇద్దరు కూతుర్లు ఉండగానే యువ డాక్టర్ సృజన చట్టపట్టాల్
కుటుంబంలో కలతలు రేపిన వ్యవహారం
ఉరి వేసుకుని భార్య డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య
దర్యాప్తు చేస్తున్న హాసన్ పర్తి పోలీసులు
హనుమకొండ (విజయక్రాంతి): ఆయన కాకతీయ మెడికల్ కాలేజీ(Kakatiya Medical College)లో అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికవర్ హాస్పిటల్(Medicare Hospital)లో కూడా ఓ కన్సల్టెంట్ గా ఓ యువ డాక్టర్.. భార్య ఇద్దరు కూతుళ్లు ఉండగానే రీల్స్ చేస్తున్న మరో అమ్మాయితో ప్రేమాయణం కొనసాగించారు. ఈ వ్యవహారం డాక్టర్ కుటుంబంలో కలతలు రేపింది. ఫలితంగా ఆ డాక్టర్ భార్య ఆదివారం సాయంత్రం హసన్ పర్తిలో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె కూడా డాక్టర్ కావడం విశేషం.. ఉన్నత కుటుంబంగా గుర్తింపు ఉన్న వారి ఇంట్లో రీల్స్ ప్రేమాయణం విషాదం నింపింది. హసన్పర్తి పోలీసులకు డాక్టర్ ప్రత్యూష కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ మట్టవాడకు చెందిన డాక్టర్ ప్రత్యూష(ఎన్ఎస్ఆర్ ఆసుపత్రిలో డెంటిస్ట్), కేఎంసిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అల్లాడి సృజన్ కు 2017లో వివాహం జరిగింది.
వీరికి 2018లో మొదటి సంతానం కూతురు జన్మించింది. గత జనవరిలో రెండో సంతానంగా రెండో కూతురు జన్మించింది. అయితే.. ఎనిమిది నెలలుగా ఇన్స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తున్న ఓ యువతి తో డాక్టర్ సృజన్ కు పరిచయమై ప్రేమాయణం సాగించినట్లు సమాచారం. ఇదే విషయం కాస్త ఇంట్లో తెలియడంతో డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ సృజన్ మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయని, తన కూతురును మానసికంగా, భౌతికంగా బాధపెట్టారని, సృజన్ తల్లిదండ్రులు కూడా కొడుకు ను మందలించకుండా తమ కూతురినే ఇబ్బందులు పెట్టారని ప్రత్యూష కుటుంబ సభ్యుల ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కూతురు మరణానికి కారణమైన డాక్టర్ సృజనతో పాటు వారి కుటుంబ సభ్యులను, సదరు యువతిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఫిర్యాదు మేరకు అసంపర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.