24-11-2025 05:36:16 PM
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్ ను ఆయన పరిశీలించి మిడ్ డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరిస్తున్నామని, 70 ఏళ్లుగా పరిష్కారంకాని సమస్యలను ఇప్పుడు పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులుగా చేసినట్లు సీఎం గుర్తు చేశారు.
సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులకు మహిళలను యజమానులను చేశామని చెప్పారు. అదానీ, అంబానీలతో పోటీపడేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామని, మహిళా సంఘాల ఉత్పత్తులు అమ్ముకునేలా 150 దుకాణాలు ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తులు అమెజాన్ లో అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జీవితాల్లో మార్పు రావాలంటే పిల్లలను చదివించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొడంగల్ లో ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈ మిడ్ డే మీల్స్ కిచెన్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొడంగల్ లోని 28 వేల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించడం వల్ల మరో 5 వేల మంది పెరిగారని, ఇక్కడ రూ.5 వేల కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో తొలి సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నామని, కొడంగల్ ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్ గా 16 నెలల్లోపు చేస్తామని రేవంత్ రెడ్డ హామీ ఇచ్చారు.