04-09-2025 10:23:37 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ(District Medical and Health Officer Dr. Venkataramana) పిఓఎంహెచ్ఎన్ డాక్టర్ సన జవేరియాతో కలిసి తనిఖీ చేశారు. హాజరు పట్టికను, అవుట్ పేషెంట్ రిజిస్టరు లను ఇతర రికార్డులను వెరిఫై చేశారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిశుభ్రతను పరిశీలించి అన్ని వేళల క్లీన్ గా ఉంచుకోవాలన్నారు. ఎన్ సి డి క్లినిక్ లో అసంక్రమిత వ్యాధుల రికార్డులను పరిశీలించి అందులో అధిక రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తుల వివరాల నమోదును పరిశీలించి వారికి మందులు ఇస్తున్న తీరును గమనించారు. అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా సరఫరా చేస్తున్న మందులను అన్ని ప్రభుత్వ హాస్పిటల్ లలో తీసుకొని వాడుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఫార్మసీ స్టోర్స్ లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వలను పరిశీలించారు.
ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులలో స్క్రీనింగ్ జరిగిన మహిళలను రీస్క్రీనింగ్ చేయాలన్నారు. ఆపరేషన్ థియేటర్ ను, ప్రసూతి గది పరిశుభ్రతలను పరిశీలించి అందులో ఉండాల్సిన అత్యవసర మందుల పరిశీలించారు. మొదటి కాన్పులను సిజేరియన్ చేయించుకోవడం వల్ల కలిగే సమస్యలను వివరించి సాధారణ డెలివరీల కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగేటట్లుగా గర్భవతులను, వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సనజ వేరియా, కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నజీమా సుల్తానా, సంబంధిత వైద్య సిబ్బంది పాల్గొన్నారు.