04-09-2025 09:47:52 PM
51 లక్షల 77 వేలకు లడ్డును దక్కించుకున్న వ్యాపారవేత్త..
గచ్చిబౌలి (విజయక్రాంతి): మాదాపూర్‌లోని మై హోమ్ భూజ(My Home Bhooja) గణేష్ ఉత్సవంలో ఈ ఏడాది లడ్డు వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఖమ్మంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్ 51 లక్షల 77 వేల 777 రూపాయలు వెచ్చించి లడ్డును సొంతం చేసుకున్నారు. ఇది మై హోమ్ భూజ లడ్డు వేలంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరగా నిలిచింది. భక్తుల పోటీ, ఉత్సాహం ఈసారి మరింతగా కనిపించిందని నిర్వాహకులు తెలిపారు. గతాన్ని పరిశీలిస్తే 2024లో లడ్డూ 29 లక్షలకు, 2023లో 25 లక్షల 50 వేలకు, 2022లో 20 లక్షల 50 వేలకు, 2021లో 18 లక్షల 50 వేలకు పలువురు దక్కించుకున్నారు.
ధరలు ప్రతి ఏడాది పెరుగుతూ రావడం, భక్తుల మధ్య పోటీ పెరగడం వల్ల ఈ వేలం గణేష్ నవరాత్రి వేడుకల్లో ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, అత్యధిక లడ్డు వేలం రికార్డు బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వద్ద నమోదైంది. అక్కడ గత ఏడాది లడ్డూ 1 కోటి 87 లక్షలకు అమ్ముడైంది. అంతకుముందు సంవత్సరం ఇదే చోట 1 కోటి 25 లక్షలకు లడ్డూ దక్కింది. మరోవైపు, సంప్రదాయంగా అందరి దృష్టిని ఆకర్షించే బాలాపూర్ లడ్డు వేలం ఈ ఏడాది ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది బాలాపూర్ లడ్డూ 30 లక్షలకు అమ్ముడైన విషయం తెలిసిందే.