06-01-2026 12:49:49 AM
13 లోగా నాగోబా జాతర ఏర్పాట్లు పూర్తి చేయాలి
కలెక్టర్ రాజర్శి షా
ఉట్నూర్, జనవరి 5 (విజయక్రాంతి): ఆదివాసులు జరుపుకునే జాతరలో దేశంలో రెండో అతిపెద్ద జాతరగా పేరు పొందిన నాగోబా జాతర నేపథ్యంలో జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ రాజర్శి షా తెలిపారు. ఈ నెల 3న విజయక్రాంతి దినపత్రికలో ‘సమీపిస్తున్న నాగోబా జాతర‘ శీర్షిక తో కథనం ప్రచురణ అయింది. ఈ కథనానికి స్పందించిన కలెక్టర్ సోమవారం ఏర్పాట్లను ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. నాగోబా జాతరలో శాశ్వతంగా ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.
తాత్కాలికంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు, అలాగే శాశ్వత పనుల నిర్మాణం కోసం విడుదలైన నిధులతో సకాలంలో లక్ష్యాలకు అనుగుణంగా వినియోగించి పనులను వేగవంతం చేయాలన్నారు. జాతరలో మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణ కొనసాగుతుం దని పేర్కొన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరపర, మరుగుదొడ్లు, విశ్రాంతి కేంద్రాలను కచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు.
నాగోబా ఆలయానికి వచ్చే నాలుగు రోడ్ల పనులను వెంటనే మరమ్మత్తులు ప్రారంభించి ఈనెల 13 లోగ పూర్తి చేయాలని పి.ఆర్ డిప్యూటీని ఆదేశించారు. జాతరను వైభవంగా నిర్వహించుటకు ఐటీడీఏ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్ అన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జాతరలో 22న దర్బార్ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు జాతర కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇంజ నీరింగ్ విభాగం ఈఈ జాదవ్ తానాజీ, తాహాసిల్దార్ ప్రవీణ్ కుమార్, డిఈఈ లు పవార్ రమేష్, శివ ప్రసాద్, ఆలయ కమిటీ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, సర్పంచ్ మెస్రం తుకారం, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం అనంతరావు పాల్గొన్నారు.