10-01-2026 01:24:21 AM
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి) : సాగుచేసిన పంటలకే రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సాగుయోగ్యంకాని భూములకు కూడా రైతు భరోసా నిధులు అందుతున్నాయని వచ్చిన విమర్శల నేపథ్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా రు. సాగు అయిన ఎకరాలను బట్టి రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.
అయితే ఎప్పటిలోగా శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ పూర్తిచేయాలనే అంశంపై చివరితేదీని నిర్ణయించలేదని సమాచారం. ఇప్పటివరకు 50 శాతం వరకు శాటిలైట్ సర్వే జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. మిగతా సర్వే ఎప్పటి వరకు పూర్తవుతుందో ఇంకా స్పష్టతలేదు. అలాంటప్పుడు రైతు భరోసా నిధులను ఎలా విడుదల చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సంక్రాంతికి భరోసా నిధులు రైతుల ఖాతాలో జమఅవుతాయని ప్రచారం జరుగుతున్నది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. రాష్ర్టంలో రబీ సీజన్ ప్రారంభమైంది. వరి నాట్లు దాదాపు పూర్తి కావస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల కింద వరి నాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మరోపక్క మొక్కజొన్న, జొన్న, మిర్చి పంటలు సైతం సాగుచేస్తున్నారు.
ప్రతి ఏటా ఎకరాకు రూ. 12 వేలు రైతుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేస్తున్నది. పట్టా పాసు బుక్ ఆధారంగా ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది? ఎంత సాగువుతుందనే వివరాలను ఏఈఓలు క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలను క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో నమోదుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వే నెంబర్ల వారీగా క్రాప్ బుకింగ్.. పాడి వివరాలను.. రైతు వివరాలను నమోదుచేయనున్నారు. దాని ఆధారంగానే ప్రభుత్వం రైతు భరోసా నిధులను సంబంధిత రైతు ఖాతాలో జమచేయబోతున్నారు.
అయితే, శాటిలైట్ ఇమేజ్ మ్యా పింగ్‌ను ఎప్పటివరకు నమోదు చేయాలనే దానిపై అధికారులకు స్పష్టత ఇవ్వలేదని స మాచారం. అలాంటప్పుడు పంటలు వివరాలను పోర్టల్‌లో ఎలా నమోదు చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. వ్యవసాయ ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వనప్పుడు భరోసా నిధులు విడుదలపైన సస్పెన్షన్ నెలకొంది. యాసంగి ప్రారంభమై నెలరోజులు అవుతున్నప్పటికీ భరోసా నిధులు జమకాకపోవ డంతో రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు.
ఈ యాసంగిలో రాష్ర్టంలో 50 లక్ష ల ఎకరాల్లో సాగవుతుందని అంచనా. రా ష్ర్టవ్యాప్తంగా సుమారు 2,600 మంది ఏఈవోలు పనిచేస్తున్నారు. మూడునాలుగు గ్రామాలకు కలిసి ఒక ఏఈఓ విధులు నిర్వహిస్తున్నారు. అంటే ఒక ఏఈఓ సుమారు 5,000 ఎకరాలు క్రాఫ్ట్ బుకింగ్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉం టుంది. సంక్రాంతికి భరోసా నిధులు విడుదల అవుతాయని ప్రచారం నేపథ్యంలో ఎలా సాధ్యమవుతుందని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ సక్సెస్ అవుతుందా అనేది సందిగ్ధంగానే ఉంది.
వానాకాలంలో రూ. 8,744 కోట్లు..
వానకాలం సీజన్‌లో రాష్ర్టంలో 69.40 లక్షల మంది రైతులకు రూ. 8,744 కోట్లను ప్రభుత్వం రైతు భరోసా కింద పంపిణీ చేసింది. అయితే వానాకాలంలో పత్తి పంట సాగు 50 లక్షల ఎకరాల్లో సాగు అయినట్లు సమాచారం. పత్తి పంట వర్షాదారిత పంటకావడంతో యాసంగి సాగు చేయరు. దీనికి తోడు మిర్చి సైతం తక్కువగా సాగు అవుతుంది. ఈ నేపథ్యంలో వానకాలంలో పత్తి, మిర్చి సాగు చేసిన రైతులకు ఈ యాసంగిలో విడుదలచేసే రైతు భరోసా నిధులు జ మచేస్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారిం ది.
భరోసా నిధులు విడుదల చేయకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉం ది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుంది అనేది రైతుల్లో ఉత్కం ఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితులను దృష్టి లో ఉంచుకొని రైతు భరోసా నిధులు ఎప్పటివరకు విడుదల చేస్తారనేది చూడాలి. గతం లో సాగైన వివరాల ఆధారంగా నిధులు విడుదల చేస్తారా?లేకుంటే వానకాలం సాగై న పత్తిపంట వివరాలను తొలగించి యాసం గి పంటలకే భరోసా నిధులు విడుదల చేస్తారా? అనేది ఉత్కంఠ నెలకొంది.
రాళ్లు, రప్పలకు లేనట్లే..?
అధికారులు గత యాసంగి, వానాకాలం సాగు లెక్కలు, రైతు భరోసా చెల్లింపుల వివరాలను పరిశీలించడంతోపాటు.. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎంతమంది రైతులకు, ఎన్ని ఎకరాలకు రైతుభరోసా చెల్లించాల్సి వస్తుంది? ఎకరానికి రూ. 6 వేల చొప్పున మొత్తం అవసరమైన నిధులెన్ని అన్న వివరాలపై కసరత్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే రాష్ర్టంలో కోటిన్నర ఎకరాలకుపైగా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నాయి.
అందులో కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలతో కూడిన బీడు భూములు, స్థిరాస్తి వెంచర్లు కూడా ఉన్నాయి. పంటల సాగుకు వీలుకాని ఈ భూములను రైతు భరోసా నుంచి మినహాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత వానాకాలం సీజన్‌లో మొత్తం విస్తీర్ణానికి రైతు భరోసా చెల్లించింది. అందులో సాగు యోగ్యంకాని సుమారు 5 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందినట్టు అధికారులు అంచనా వేశారు.
యాసంగిలో ఇది పునరావృతం కావద్దని సాగు భూములను, సాగు యోగ్యంకాని భూములను పక్కాగా ధ్రువీకరించడానికి ఉపగ్రహ చిత్రాల (శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్) ద్వారా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి, జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి ఈ బాధ్యత అప్పగించింది. ఈ ప్రక్రియ ఎప్పటివరకు పూర్తి చేస్తారనేది తెలియకుండా ఉంది.