24-10-2025 12:00:00 AM
గద్వాల, అక్టోబర్ 23 ( విజయక్రాంతి ) : జిల్లాలోని రైస్ మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత పౌరసరఫరాల అధికారులు, జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైస్ మిల్లులకు కేటాయించిన సిఎంఆర్ లక్ష్యాలను పూర్తిచేసే విధంగా ఆయా రైస్ మిల్లర్ల నిర్వాహకులు కృషి చేయాలని కోరారు.
ఖరీఫ్ 2025-26 సంవత్సరానికి సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మిల్లర్లు సహకరించాలని అన్నారు. మిల్లర్లకు అసౌకర్యం కలగకుండా అవసరమైన గన్ని బ్యాగులు ప్యాడి క్లీనర్లు, రవాణా, గోదాముల ఏర్పాట్లు చేయాలని సంబంధిత పౌరసరఫరాల అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, రైస్ మిల్లర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు రామలింగేశ్వర కామ్లే, కార్యదర్శి సుదర్శన్, మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.