24-10-2025 12:00:00 AM
పట్టించుకొని అధికారులు, పాలకులు
రేగోడు, అక్టోబర్ 23 : విద్యార్థినీల సౌకర్యార్థం నిర్మించిన హాస్టల్ భవనం నిరుప యోగంగా మారింది. భవన నిర్మాణం పూర్తి చేసి నెలలు గడుస్తున్నా ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. దీంతో బాలికల మోడల్ హాస్టల్ భవనం వినియోగం లోకి రావడం లేదు. ఈ విషయంలో అధికారులు, పాలకులు పట్టించుకోక పోవడంతో మరింత కాలయాపన చేస్తున్నారు.
మండల కేంద్రమైన రేగోడులో లక్షలు వెచ్చించి నిర్మించిన బాలికల మోడల్ హాస్టల్ భవనం పూర్తయి నెలలు గడుస్తున్నప్పటికీ భవనం ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారింది, భవనం నిరుపయోగంగా మారడంతో హాస్టల్ ఆవరణలో పిచ్చి మొక్కలు నిండిపోయాయి. రేగోడులో బాలికల మోడల్ హాస్టల్ ప్రారంభమైతే మోడల్ పాఠశాలలో చదువుకునే విద్యార్థినీలు అక్కడే ఉండి చదువుకుంటారు. హాస్టల్ భవనం పూర్తయి నెలలు గడుపుతున్నప్పటికీ ఇంకా ప్రారంభానికి ఎందుకు నోచుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
హాస్టల్ భవనం తొందరగా ప్రారంభమైతే మా పిల్లలకు ఇబ్బందులు తప్పుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. అధికారుల అలసత్వమా నాయకుల నిర్లక్ష్యమా అని ప్రజలు విమర్శిస్తున్నారు. రేగోడు మాడల్ పాఠశాలలో అయా గ్రామల నుంచి వచ్చే విద్యార్థులు చాలామంది చదువుకుంటున్నారు.
హాస్టల్ భవనం ప్రారంభిస్తే విద్యార్థులు ఇంటి నుండి రావడం తప్పుతుంది. ఇక్కడ హాస్టల్ లో ఉండి చదువుకునేందుకు బాగా ఉంటుందని విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి బాలికల మాడల్ హాస్టల్ ను ప్రారంభించాలని మండల ప్రజల ఈ సందర్భంగా కోరుతున్నారు.
విద్యార్థుల ఇబ్బందులు తొలుగుతాయి..
రేగోడులోని బాలికల మాడల్ హాస్టల్ భవనం పూర్తయినా ప్రారంభోత్సవం ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. హాస్టల్ భవనం ప్రారంభమైతే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు అవస్థలు తప్పుతాయని, అలాగే పరీక్షల సమయంలో సౌకర్యంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు భవనంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా వంట సామాగ్రి రాలేదని తెలిసింది.
అలాగే వంట మనుషులను కూడా నియమించాల్సి ఉంది. ఏదిఏమైనా హాస్టల్ భవనం ప్రారంభించడానికి రాజకీయ గ్రహణం ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ్మ స్పందించి భవనం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.