20-09-2025 12:00:00 AM
-‘ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంతన్నా కా సహారా పేరిట కొత్త పథకాలు
-ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
-మైనారిటీల జీవన ప్రమాణాల మెరుగునకు పథకాలు దోహదపడతాయని వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : తెలంగాణ మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ‘రేవంతన్నా కా సహారా కోసం’ పేరుతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించిన పోర్టల్ ఏర్పాటు చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో రెండు కొత్త పథకాలను మంత్రి ప్రారంభించారు. ఈ రెండు పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... ఈ రెండు పథకాలు మైనారిటీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయని, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని వెల్లడించారు. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుందని తెలిపారు. ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఇవ్వడం వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని అన్నారు.
ఈ రెండు పథకాలకే ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ పథకాలు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతాయ న్నారు. చిన్న వ్యాపారాల ద్వారా సంపాదన పెరిగితే, వారిలోని యువతకు చదువులోనూ, ఉపాధిలోనూ మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అక్టోబర్ 10వ తేదీ వరకు టీజీఓబీఎంఎంఎస్ వెబ్ పోర్టల్ tgobmms.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రారంభించిన పథకాలు
1. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన: వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు రూ. 50 వేల సాయం.
2. రేవంతన్నా కా సహారా మిస్కీన్ల కోసం: ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి రూ. లక్ష గ్రాంట్.