08-03-2025 02:25:16 AM
గజ్వేల్, మార్చి 7 : సహారా ఇండియా సంస్థపై కోర్టులో కేసులు కొనసాగుతున్న విషయాన్ని కప్పిపుచ్చి అమాయక ప్రజల వద్ద మాయమాటలు చెప్పి సహారా ఏజెంట్లు డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. గత రెండు రోజులుగా విజయ క్రాంతి దినపత్రికలో గజ్వేల్ సహారా కార్యాలయం పై వస్తున్న వార్తా కథనాలతో అప్రమత్తమవుతున్న డిపాజిటర్లను మళ్లీ అదే మాయమాటలతో ఏజెంట్లు మోసం చేస్తున్నారు.
తమ వద్ద డబ్బులు వసూలు చేసి లెక్క చూపని ఏజెంట్ల పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తున్న డిపాజిటర్లకు ఫోన్లు చేస్తూ డబ్బులు ఇప్పిస్తాము పోలీస్ స్టేషన్కు వెళ్లకండి అంటూ బతిమిలాడుతున్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్తే డబ్బులు రావంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. శుక్రవారం వివిధ గ్రామాలకు చెందిన 30 మంది డిపాజిటర్లు గజ్వేల్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలనుకున్నారు.
ఈ విషయం తెలిసిన సదరు ఏజెంట్లు ఆయా డిపాజిటర్లకు ఫోన్లు చేసి మేము పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నామని మాపై కేసు పెట్టిన వారితో మాట్లాడుతున్నామని, పోలీస్ స్టేషన్కు ఎవరూ రావద్దంటూ చెప్పారు. డిపాజిట్ చేసిన డబ్బులు ప్రతి రూపాయి ఇస్తామంటూ ఏజెంట్లు బతిమిలాడారు. గజ్వేల్,రాయపోల్ తదితర సమీప మండలాల కు చెందిన గ్రామాల ప్రజల నుండి గత కొద్ది నెలలుగా డిపాజిట్లు వసూలు చేస్తున్న రసీదులు మాత్రం వారికి ఏజెంట్లు ఇవ్వడం లేదు.
ఈ విషయాన్ని విజయ క్రాంతి తో చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము మోసపోతున్నామని అర్థమై ఇతర డిపాజిటర్లకు ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి రావాలంటూ కోరుతూ ఉండగా, ఏజెంట్ల మాటలు నమ్మి మిగతా డిపాజిటర్లు పోలీస్ స్టేషన్కు రావడం లేదు. ఒకరిద్దరు మాత్రమే ధైర్యం చేసినా పోలీస్ స్టేషన్కు వెళితే తమ మాట చెల్లుతుందో లేదో అని భయపడుతున్నారు.
కంపెనీ తిరిగిడబ్బులు డిపాజిటర్లకు ఎప్పుడు చెల్లిస్తుందో తెలియకుండానే ఏజెంట్లు ప్రజల వద్ద డిపాజిట్లు వసూలు చేయడం, ఆ డబ్బులకు రసీదులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. కొన్ని నెలలుగా ఏజెంట్లు వసూలు చేస్తున్న డబ్బులు సహారా ఇండియా ఖాతాలో జమ కాకపోవడం గమనార్హం.
ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న ప్రభుత్వాలు , పోలీసు వ్యవస్థ ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఏమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డిపాజిటర్లకు చెందిన కోట్ల రూపాయలు కోర్టు కేసుతో ప్రభుత్వం సీజ్ చేయగా, ఏజెంట్లు వసూలు చేస్తున్న డబ్బులు ఇలా తిరిగి తీసుకోవాలో అర్థం కాక డిపాజిటర్లు లబోదిబోమంటున్నారు.
సమాచారం రాగానే సమాధానం ఇస్తాం
ఏజెంట్లు డిపాజిటర్ల నుండి డబ్బులు వసూలు చేసి ఆఫీసులో జమ చేస్తుంటారు. ప్రస్తుతం డిపాజిట్ చేస్తున్న డిపాజిటర్లకు డబ్బులు ఎప్పుడు చెల్లిస్తామో మాకు తెలియదు. హెడ్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చాము. అక్కడినుండి సమాచారం రాగానే సమాధానం ఇస్తాము.
అశోక్ గజ్వేల్ సహారా కార్యాలయ మేనేజర్.