calender_icon.png 3 January, 2026 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా, వైద్యం సంక్షేమాన్ని గాడిలో పెట్టాం

03-01-2026 10:44:26 AM

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో విద్య, వైద్యం, సంక్షేమ రంగాలను గాడిలో పెట్టామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

గతేడాది విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో జిల్లా రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందిందని, 2026లో కూడా విద్య, వైద్యం, అంగన్వాడీలు, మహిళా అభ్యున్నతి, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, రైతు సంక్షేమంపై మరింత దృష్టి పెడతామని తెలిపారు.

భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, రోజుకు ఒక మండలాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాదాపు 3 వేల దరఖాస్తులు పరిష్కరిస్తామని, తొలి విడతలో పెంట్లవెల్లి మండలంతో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని, యూరియా కొరత సృష్టించిన లేదా అక్రమాలకు పాల్పడిన దుకాణాలపై కఠిన చర్యలు, సీజ్ చేస్తామని హెచ్చరించారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తొలి విడత లబ్ధిదారులలో 60 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, చెంచుపెంటల్లో 1100 ఇళ్లను జిల్లా యంత్రాంగమే నేరుగా నిర్మించి అందిస్తామని తెలిపారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు. మీడియా ప్రతినిధులు రోడ్డు భద్రత పాటిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కూడా కలెక్టర్ సూచించారు.