03-01-2026 02:37:31 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఏజెన్సీలో ఆదివాసుల సాగులో ఉన్న పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారులు ఆదివాసుల పోడు భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ రైతు కూలీ సంఘం(ఏఐకేఎంకేఎస్) రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పాల్వంచ పట్టణంలోని తెలంగాణ రైతు కూలీ సంఘం (ఏఐకేఎంకేఎస్) జిల్లా కార్యాలయంలో బండ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసాదన్న పాల్గొని మాట్లాడారు. షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన పాలకులు ఏరు దాటినంక తెప్ప తగలేసినట్టు పట్టాలు ఇవ్వకుండా ఆదివాసులను ఇక్కట్లకు గురి చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వాల ద్వంద్వ విధానాలతో ఫారెస్ట్ అధికారులు దఫాలుగా పోడు భూములను స్వాధీనం చేసుకుంటుంటే ఆదివాసులు తమ జీవనాధారమైన భూమిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5వ షెడ్యూలు ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి ప్రజలను దేశవ్యాప్తంగా 1952 రాష్ట్రపతి గెజిట్ ప్రకారం షెడ్యూల్ ట్రైబల్(ST) లుగా గుర్తించారని, భారత షెడ్యూల్ చట్టాల ప్రకారం చతిస్గఢ్ అయిన, ఒరిస్సా అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా ఆదివాసీ తెగలను షెడ్యూల్ ట్రైబల్ గానే గుర్తించాలని, చతిస్గడ్ ప్రాంతం నుండి తెలంగాణకు వచ్చి రెండు దశాబ్దాలకు పైగా నివసిస్తున్న ఆదివాసులను షెడ్యూల్ ట్రైబల్ గా గుర్తించి వారి సమస్యలు పరిష్కరించాలని, ఏజెన్సీలో ఆదివాసుల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు వారు ఇచ్చిన హామీ మేరకు పోడు భూముల పట్టాల సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో చొరవ చూపాలని, ఫారెస్ట్ అధికారులు పోడు భూముల జోలికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు.
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏజెన్సీలో ఆదివాసుల సాగులో ఉన్న పోడు భూములను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని నిలిపివేసి, ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని, 1/70 చట్టం, 1996 షెడ్యూల్ ఏరియా పంచాయతీరాజ్ చట్టం (పెస చట్టం), 1997 సుప్రీంకోర్టు సమత జడ్జిమెంట్ తదితర షెడ్యూల్ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ ఈనెల 6వ తారీఖున భద్రాచలంలో ర్యాలీ, ఐటీడీఏ పీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ పోడు సాగుదారులకు, ప్రజాస్వామిక వాదులకు తెలంగాణ రైతు కూలీ సంఘం (ఏఐకేఎంకేఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పిలుపు నిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం (ఏఐకేఎంకేఎస్) రాష్ట్ర నాయకులు మోర రవి, జిల్లా నాయకులు సూరేపల్లి వెంకటేశ్వర్లు, శర్ప నారాయణ, కుంజ వెంకటేశ్వర్లు, ఊకం పాపారావు, మడివి సోమయ్య, రెంటాల నారాయణ, రాజు, గంగయ్య, మమత, సోమక్క, పద్మ, తదితరులు పాల్గొన్నారు.