calender_icon.png 26 September, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మగౌరవానికి శాశ్వత ప్రతీకగా చాకలి ఐలమ్మ: కలెక్టర్ బి.యం. సంతోష్

26-09-2025 09:14:11 PM

గద్వాల,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ విశిష్టమైన పాత్ర పోషించి, మహిళా చైతన్యం, ధైర్యసాహసాలు, బహుజన ఆత్మగౌరవానికి శాశ్వత ప్రతీకగా నిలిచారని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వీరనారి, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా, ఆమె చిత్రపటానికి పూలమాలలు సమర్పించి గౌరవ నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... చాకలి ఐలమ్మ కేవలం ఒక మహిళగా మాత్రమే కాకుండా, సమాజంలో అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతినిధిగా నిలిచారని తెలిపారు. భూస్వాముల అన్యాయాలు, దోపిడీలకు వ్యతిరేకంగా తన ధైర్యాన్ని ఆయుధంగా మార్చుకొని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతర పోరాటం చేసిన శ్రమజీవి యోధురాలని పేర్కొన్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలు, అణచివేతలు, అవమానాలను ఎదుర్కొంటూ వెనక్కి తగ్గకుండా, తన ధైర్యసాహసంతోనే సమాజానికి కొత్త మార్గం చూపారని తెలిపారు.

ఆమె చేసిన పోరాటం కేవలం భూస్వాముల అన్యాయాల మీద గెలుపు మాత్రమే కాకుండా, సమాజంలో న్యాయం, సమానత్వం, మహిళా శక్తి విస్తరణకు పునాది వేశారని అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం,బహుజన గౌరవం, మహిళా హక్కుల సాధన కోసం ఆమె జీవితాన్ని ఒక మార్గదర్శక దీప్తిలా భావించాలని అన్నారు. నేటి యువత,ముఖ్యంగా మహిళలు, చాకలి ఐలమ్మ జీవితం నుంచి ప్రేరణ పొందుతూ, ధైర్యం, పట్టుదల, త్యాగస్ఫూర్తిని తమ జీవితాల్లో ఆచరణలో పెట్టుకోవాలని, సవాళ్లు వచ్చినప్పుడు వెనుకాడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు.