15-10-2025 12:30:06 AM
పాఠశాలలు, ఏటీసీ కేంద్రాలలో సదుపాయాల పరిశీలన
నిజామాబాద్ అక్టోబర్ 14 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా సిరికొండ, భీంగల్, కమ్మర్పల్లి మండలాల్లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ లను సందర్శించి, వసతి సదుపాయాలను పరిశీలించారు. సిరికొండ మండలం చిమన్ పల్లి గ్రామంలో కొనసాతున్న జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, తరగతి గదులు, డార్మెటరీ, కిచెన్, టాయిలెట్స్ లను పరిశీలించారు. సరైన వసతులు లేకుండా కిచెన్, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిర్వహణ తీరును చక్కదిద్దాలని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే ప్రాంగణంలో కొనసాగుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, అవసరమైన మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. . అనంతరం కమ్మర్పల్లి మండలం బషీరాబాద్, భీంగల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు అనుసంధానంగా నూతనంగా నెలకొల్పిన అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లను కలెక్టర్ సందర్శించారు. ఈ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. భీంగల్ ఏ.టీ.సీ కేంద్రం తుది దశ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు, కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.