29-07-2025 05:54:13 PM
జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్..
గద్వాల (విజయక్రాంతి): విద్యార్థులు ప్రతిరోజూ క్రమశిక్షణతో తరగతులకు హాజరై, విద్యను అభ్యసిస్తే జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్(District Collector BM Santosh) అన్నారు. మంగళవారం మల్దకల్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజన సదుపాయం, ఆహార నాణ్యత, సైన్స్ ల్యాబ్ తదితర వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధనతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని అన్నారు.
ఇందుకు గాను అవసరమైన వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు, నాణ్యమైన బోధన, మౌలిక వసతులు సమకూర్చడం జరుగుతుందన్నారు. విద్యార్థుల పఠన సామర్ధ్యం ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు రెగ్యులర్ గా హాజరయ్యేలా చూడాలన్నారు. ఉపాధ్యాయుల బోధనలను విద్యార్థులు శ్రద్ధగా విని, క్రమశిక్షణతో సాధన చేస్తే ఒక సాధారణ విద్యార్థి కూడా ఐఏఎస్ అధికారి, శాస్త్రవేత్త, లేదా సమాజానికి మార్గనిర్దేశకుడిగా ఏదగ గలుగుతారని అన్నారు. పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 104 మంది విద్యార్థులు ఉన్నారని, వారు అందరూ ఉత్తీర్ణులై వంద శాతం ఫలితాలు సాధించాలని అన్నారు.
గత సంవత్సరం ఎవరూ ఈ పాఠశాలలో 540కి పైగా మార్కులు సాధించకపోవడం నిరాశ కలిగించిందని, ఈసారి ప్రతి ఒక్కరూ మెరుగైన ఫలితాలతో ఉత్తీర్ణులవ్వాలన్నారు.అత్యుత్తమ మార్కులు సాధించిన వారిని జిల్లా స్థాయి కార్యక్రమాల్లో సత్కరించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న చదవకాశాలను వినియోగించుకొని పక్కా ప్రణాళికతో ముందుకు సగాలన్నారు. ఈ పాఠశాల పీ.యం. శ్రీ పథకానికి ఎంపికైనందున ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని సూచించారు. విద్యార్థులు పాఠాలు బాగా అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, భోజనం వడ్డించే ముందు, ఆహార నాణ్యతను క్వాలిటీ కమిటీ ద్వారా తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు.
గత సంవత్సరం రాష్ట్రంలో 32వ స్థానంలో ఉన్న జిల్లా ఈసారి 23వ స్థానానికి చేరిందని, వచ్చేసారి కనీసం 15వ స్థానాన్ని సాధించాలన్నదే లక్ష్యమన్నారు. అనేక మంది ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎదిగారని, గద్వాల్ ప్రభుత్వ బాలుర పాఠశాల నుండీ ఉన్నత స్థాయికి చేరినవారు ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు పెద్ద కలలు కంటు ప్రతిరోజూ చిన్న ప్రయత్నాలతో ముందడుగేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి సురేష్, కో- ఆర్డినేటర్ ఎస్తర్ రాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.