26-12-2025 01:48:02 AM
ఢాకా, డిసెంబర్ 25 : బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2026 ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘అవామీ లీగ్’ పార్టీని అనుమతించబోమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు షఫీకుల్ ఆలం ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో దశాబ్దాల కాలం పాటు చక్రతిప్పిన అవామీ లీగ్ పార్టీ భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది. జూలై ప్రజా ఉద్యమం తర్వాత దేశం విడిచి వెళ్లిన షేక్ హసీనా పార్టీపై తాత్కాలిక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఆ పార్టీ కార్యకలాపాలపై నిషేధం విధించింది.
దీంతో పాటు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఆ పార్టీ నాయకులు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో విచారణ ఎదుర్కొంటున్న కారణంగా దాని అనుబంధ సంస్థల అన్ని కార్యకలాపాలను నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ సైతం జారీ చేశారు. ఎన్నికల కమిషన్ అవామీ లీగ్ పార్టీ రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేశారని చెప్పారు.
ఎన్నికలు కావు పట్టాభిషేకం
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయంపై ఆ దేశా మాజీ ప్రధాని షేక్ హసీనా ఘా టుగా స్పందించారు. ‘అవి ఎన్నికలు కావని అది ఒక పట్టాభిషేకం మాత్రమే. ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా యూనస్ పాలన సాగిస్తున్నారు. తొమ్మిదిసార్లు ప్రజ లు ఎన్నుకున్న పార్టీని నిషేధించడం ద్వారా కోట్లాది మంది ఓటర్ల హక్కులను కాల రాస్తున్నారు. ఇలాంటి ఎన్నికల ద్వారా వచ్చే ప్రభుత్వానికి నైతిక అధికారం ఉండదు’ అని ఆమె పేర్కొన్నారు.