calender_icon.png 26 December, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్ పట్టేస్తారా ?

26-12-2025 01:44:44 AM

వన్డే ప్రపంచకప్ విజయం తర్వాత మరో సిరీస్ విజయంపై కన్నేసింది భారత మహిళల క్రికెట్ జట్టు... సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ టీ20 సిరీస్ విజయానికి అడుగు దూరంలో నిలిచింది. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ దుమ్మురేపుతూ లంకను డామినేట్ చేస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ కో హ్యాట్రిక్ కొడితే సిరీస్ కైవసం చేసుకుంటుంది. బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ , జెమీమా రోడ్రిగ్స్ దుమ్మురేపుతుంటే.. బౌలింగ్‌లో సమిష్టిగా రాణిస్తున్నారు. మరి తొలి రెండు మ్యాచ్‌లలో పెద్దగా పోటీ ఇవ్వలేకపోయిన శ్రీలంక మూడో టీ20లోనైనా పోరాడుతుందా.. ?

  1. నేడు శ్రీలంకతో భారత్ మూడో టీ20

తిరువనంతపురంలో మ్యాచ్

తిరువునంతపురం, డిసెంబర్ 25 : సొంతగడ్డపై వరల్ కప్ విజయం తెచ్చిన జోష్ తో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొడుతోం ది. శ్రీలంకపై టీ20 సిరీస్ గెలిచేందుకు మరో విజ యం దూరంలో మాత్ర మే ఉంది. తొలి రెండు టీ ట్వంటీల్లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ తప్పిదాలు కనిపించినా రెండో మ్యాచ్ లో అవి పూర్తిగా మెరుగయ్యాయి.

ప్రస్తుతం 2--0 ఆధిక్యంలో ఉన్న భారత మహిళల జట్టు తిరువనంతపురం వేది కగా జరిగే మూడో టీ20లోనూ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది. తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో, రెండో టీ20లో 7 వికెట్ల తేడాతోనూ వన్ సైడ్ విక్టరీలను అందుకున్న భారత్ కు లంక పెద్దగా పోటీనివ్వలేకపోయింది. బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ తన ఫామ్ కంటిన్యూ చేస్తోంది. తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయినా, రెండో ట్వంటీలో మాత్రం అదరగొట్టింది. భారీ షాట్లతో లంక బౌలర్లకు చుక్కలు చూపించింది.కేవలం 34 బంతుల్లోనే 69 పరుగులు చేసింది.

మరో ఓపెనర్ స్మృతి మంధాన మాత్రం ఇంకా మెరుపులు మెరిపించలేదు. షెఫాలీతో పాటు ఆమె కూడా చెలరేగితే భారీస్కోరు ఖాయం. అలాగే స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ మాత్రం అదరగొడుతోంది. గత రెండు మ్యాచ్‌లలో క్రీజులో కొద్దిసేపే ఉన్నా దుమ్మురేపేసింది.  జెమీమా పూర్తిస్థాయి ఇన్నింగ్స్ ఆడితే మాత్రం లంక బౌలర్లకు కష్టాలు తప్పవు. అయితే హర్మన్ ప్రీత్ మాత్రం ఇంకా తన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడలేదు. 

రిఛా ఘోష్, అమన్ జోత్ కౌర్, స్నేహా రాణాపైనా అంచనాలున్నాయి. మరోవైపు బౌలింగ్‌లో సమిష్టిగా రాణిస్తోంది. క్రాంతి గౌడ్ , వైష్ణవి శర్మ, శ్రీచరణి కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ లంకను దెబ్బతీస్తున్నారు. వీరి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు లంక బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత మ్యాచ్‌లో కనీసం సింగిల్స్ తీసేందుకు కూడా శ్రమిస్తూనే ఉన్నారు.

ఈ త్రయం మరోసారి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే లంక తక్కువ స్కోరుకే పరిమితమవడం ఖాయం. జ్వరంతో గత మ్యాచ్‌కు దీప్తి శర్మ దూరమైనప్పటకీ.. స్నేహ రాణా ఆమె లేని లోటును భర్తీ చేసింది. అద్భుతంగా బౌలింగ్ చేసి లంకను దెబ్బకొట్టింది. దీప్తి కోలుకోవడంతో ఎవరిని తప్పిస్తారనేది చూడాలి. ఇదిలా ఉంటే తొలి టీట్వంటీలో పేలవ ఫీల్డింగ్ కంగారు పెట్టినా రెండో మ్యాచ్ కు అంతా సెట్ అయింది.

పలు అద్భుతమైన క్యాచ్‌లు అందుకోవడంతో పాటు షార్ప్ రనౌట్లు చేశారు. ప్రస్తుతం ఫీల్డింగ్ కూడా గాడిన పడడంతో ఇక భారత జట్టుకు తిరుగేలేదని చెప్పొచ్చు. మరోవైపు వరుసగా రెండు పరాజయాలతో శ్రీలంక జట్టు పూర్తి ఒత్తిడిలో ఉంది. సిరీస్ చేజారిపోకుండా ఉండాలంటే మూడో టీ20లో ఆ జట్టు గెలిచి తీరాలి. ప్రస్తుతం లంక బ్యాటర్ల ఆటను చూస్తే భారత్ ను నిలువరించడం వారి శక్తికి మించిన పనే. బ్యాటర్ల వైఫల్యంతోనే గత రెండు మ్యాచ్ లలో లంక చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో లంక ఓపెనర్లు, టాపార్డర్ రాణించాల్సిందే.

అటు బౌలింగ్ లోనూ లంక తేలిపోతోంది. భారత బ్యాటర్లను కట్టడి చేయడం  వారి వల్ల కావడం లేదు. దీంతో బౌలర్లు కూడా గాడిన పడితే తప్ప భారత్‌కు పోటీ ఇవ్వడం కూడా లంకకు కష్టంగానే కనిపిస్తోంది. ఇక పిచ్ విషయానికొస్తే ఇక్కడ మహిళల టీ20 జరుగుతుండడం ఇదే తొలిసారి. మంచు ప్రభావం ఉండనుండడంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కే మొగ్గుచూపొచ్చు.