వరంగల్,(విజయక్రాంతి): దుగ్గొండి మండలంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం, మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహాన్ని, గిర్నిబావి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ లలోని ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఫిర్యాదులను పరిష్కరించేందుకు వార్డెన్లు ప్రిన్సిపల్స్ లకు తగు సూచనలు చేశారు. విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించిన అనంతరం హాజరుతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు.
తరగతి గదులను, వంటశాలను, స్టోర్ రూంను తనిఖీ చేసి, టాయిలెట్స్, హాస్టల్ ప్రాంగణం, వంట చేసే ప్రాంతాలను, స్టోర్స్ లోని సరుకులను పరిశీలించారు. తాజా సరుకులను అందించాలని, హాస్టల్ లోపల, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల విద్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.ప్రతి సోమవారం నర్సంపేట వైద్య ఆసుపత్రి డాక్టర్స్ తో వైద్య పరీక్షలు చేయంచాలని సంబంధిత హాస్టల్ వార్డెన్లు ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత హాస్టల్ వార్డెన్లు, ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు