20-09-2025 12:17:42 AM
చేగుంట,(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరిచే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. శుక్రవారం చేగుంట మండలంలో ఎస్సీ బీసీ సంక్షేమ వసతి గృహాలను పరిశీలించి విద్యార్థుల మౌలిక వసతులు, విద్యా సామర్థ్యాలు, నాణ్యమైన మెనూ తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అన్ని సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు వసతిగృహాల్లోమౌలిక వసతులపై మరమ్మత్తులు నిర్వహించి సౌకర్యాలు మెరుగుపరుచుటకు ఇంజనీరింగ్ అధికారులు తయారు చేసిన నివేదికల ఆధారంగా చేగుంట మండలంలో ఎస్సీ బీసీ వసతి గృహాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. అన్ని సంక్షేమ వసతి గృహాల ఆశ్రమ పాఠశాలల వార్డెన్స్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్, గురుకులాల ఆర్సీఓలు త్వరలో సమావేశం నిర్వహించుకుని సంపూర్ణ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు నాణ్యమైన గుణాత్మక విద్య అందించడం లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు.