20-09-2025 12:17:46 AM
-జేసీబీ సాయంతో రక్షించిన స్థానికులు, పోలీసులు
-యాదాద్రి భువనగిరి జిల్లా రావిపహాడ్ తండా అనాజపురం మధ్య ఘటన
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 19 ( విజయక్రాంతి)ః యాదాద్రి భువనగిరి జిల్లాలోని చిన్నేరు వాగులో చిక్కుకున్న ఓ యువకుడిని పోలీసులు, స్థానికులు చాకచాక్యంగా రక్షించారు. గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాగే బీబీనగర్ మండలం రావిపహాడ్ తండా భువనగిరి మండలం అనాజపురం గ్రామాల మధ్య ఉన్న చిన్నేరు వాగు కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది.
శుక్రవారం మాదారం గ్రామానికి చెందిన వెలువర్తి మహేష్ అనే యువకుడు వాగును దాటడానికి ప్రయత్నం చేసి మధ్యకు వెళ్లగానే వరద ఉధృతంగా రావడంతో కిందికి కొట్టుకపోయి లో లెవెల్ బ్రిడ్జి పిల్లర్ పట్టుకుని రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడివారి సహకారంతో జేసీబీ సాయంతో వాగులోకి వెళ్లి యువకుడ్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. సహకరించిన స్థానికులను, జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అభినందించారు. కాగా ఇటీవల బీబీనగర్ మండలం గూడూరు వద్ద పెద్దవాగులో యువకుడు గల్లంతయాడు. ఆ యువకుని కోసం పోలీసులు రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపడుతుండగానే తాజాగా చిన్నేరు సంఘటన జరిగింది.