07-10-2025 04:09:52 PM
స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన
పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ లైటింగ్ ఏర్పాట్లు చేయాలి
సీసీ కెమెరాలు, భద్రత, పోలీసు బందోబస్తుపై ఆరా
అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఆయన ఆకస్మికంగా కాటారంలో పర్యటించారు. కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్ట్రాంగ్ రూము, ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూముల భద్రత, సీసీ కెమెరా, పోలీస్ బందోబస్తు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై ఆయన ఆరా తీశారు. ఎన్నికల సమయంలో ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు, లెక్కింపు గదులలో విద్యుత్, లైటింగ్, భద్రత వంటి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపిడివోలు అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సౌకర్యాల కల్పనపై ధ్రువీకరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. దివ్యాంగులకు ర్యాంపు, మూడు చక్రాల సైకిళ్ళు అందుబాటులో ఉంచేలా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు.