08-09-2025 07:42:55 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షుడు ఉండ్రాల ఎల్లయ్య తన దరఖాస్తులో జిల్లాలో ఎస్.సి., ఎస్.టి. మానిటరింగ్ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. మంచిర్యాల పట్టణానికి చెందిన చకినారపు సావిత్రి తాను నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకుని కులాంతర వివాహం చేసుకున్నానని, కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నానని, చెన్నూరు పట్టణంలోని శిశు మందిర్ వాడలో గల అంగన్వాడి లో అవకాశం ఉన్నందున తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. చెన్నూరు మండలం వెంకంపేట గ్రామానికి చెందిన బి. సమ్మయ్య తన కూతురుకు రెబ్బెన గురుకులంలో సీటు వచ్చిందని, నిరుపేద కుటుంబం అయిన తమకు ఆర్థిక స్తోమత లేనందున మంచిర్యాల జిల్లాకు బదిలీ చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీకి చెందిన ఎంజాల కుమార్ మండలంలోని తాళ్ల గురుజాల శివారులో గల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. హాజీపూర్ మండలం గడ్ పూర్ గ్రామానికి చెందిన సోగల చందు తన కుమారుడు కోటపల్లి మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుతున్నాడని, రాకపోకలకు ఆర్థిక స్తోమత లేదని, తన కుమారుడికి హాజీపూర్ మండలం ముల్కల్ల లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలకు బదిలీ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన సంధ్య వేణి నడిపి రాజం తాను కొనుగోలు చేసిన పట్టా భూమి ఆన్ లైన్ లో నిషేధిత భూమి జాబితాలో చూపిస్తుందని, తొలగించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణంలోని సూర్య నగర్ కు చెందిన ఆసంపల్లి చంద్రకళ తాను తన భర్త ఇద్దరు దివ్యాంగులమని, ఎలాంటి ఉపాధి ఆధారము లేదని, నిరుపేద అయిన తమకు రెండు పడక గదుల ఇండ్లలో అవకాశం కల్పించి ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు.