08-09-2025 09:53:34 PM
కౌటాల,(విజయక్రాంతి): తనకు రక్షణ కల్పించాలని సునీతమ్మ (80) హిజ్రా సోమవారం కౌటాలలో విలేకరులకు ఇచ్చిన ప్రకటనలో తన గోడు వ్యక్తం చేసింది. గత 60 సంవత్సరాలుగా సిర్పూర్, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల్లో తన సాంప్రదాయ జీవనోపాధి అయినా బధాయి ద్వారా తన గ్రూప్ లోని ఐదు నుంచి పది మందితో కలిసి గౌరవప్రదంగా జీవనం సాగిస్తున్నానన్నారు. ఇటీవల ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని వేరొక హిజ్రా గ్యాంగ్ ఒక గ్రూపుగా ఏర్పడి తనపై పలుమార్లు దాడులు జరిపి జీవనోపాధి భద్రతకు తీవ్ర భంగం కలిగిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆ గ్యాంగ్ వారు 15 మండలాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ, తమ గ్యాంగులో కలవాలంటే రెండు లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీంతో తనతో పాటు తన గ్రూపులోని ఇతర సభ్యులు కూడా జీవనోపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధ హిజ్రా మహిళల అయిన తనపై దాడులు చేసి బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.