calender_icon.png 15 September, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ సాబ్.. జర దేఖో

15-09-2025 12:00:00 AM

  1.   200 ఎకరాలపై పెద్దల కన్ను
  2. తొలి విడతలో 13 ఎకరాల్లో వెంచర్
  3. వంత పాడుతున్న ప్రతిపక్ష లీడర్లు
  4. భువనగిరిలో రాయల్ రిడ్జ్ ఘరానా మోసం
  5. చోద్యం చూస్తోన్న అధికార యంత్రాంగం
  6. చక్రం తిప్పుతున్న ఓ ఎమ్మెల్యే అనుచరుడు
  7. నో పర్మిషన్.. ఓన్లీ క్యాష్..
  8. దర్జాగా ప్లాట్లు అమ్ముకుంటున్న వైనం

నల్లగొండ, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకుని తిన్నారనే చందంగా అధికార, ప్రతిపక్ష పార్టీల లీడర్లు కలిసి భూదందాకు తెరలేపారు. ఇసుమంతైనా అనుమతుల్లేకుండానే వందల ఎకరాల వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చేసి రూ.కోట్ల దందాకు తేరలేపారు. భువనగిరి మండలంలోని కూనూరు గ్రామపంచాయతీ పరిధి లోని 17, 38, 39,45 సర్వే నంబర్లలో ఆవీజీ డవలపర్స్ సంస్థ రాయల్ రిడ్జ్ రిసారట్స్ పేరుతో భారీ వెంచర్ను ఏర్పాటు చేసింది.

దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ప్రీకాస్ట్ వాల్స్ను రాత్రికి రాత్రి ఏర్పాటు చేసి.. సదరు భూమిలో ఉన్న కొంగలకుంటను సైతం పూడ్చేసి భారీ వెంచర్కు తెరలేపింది. నిజానికి రాయల్ రిడ్జ్ రిసార్ట్స్కు ప్రభుత్వం తరపు నుంచి ఏలాంటి అనుమతులు తీసుకోలేదు. సరికదా.. తమకు అన్నీ అనుమతులు ఉన్నాయనే రేంజ్లో రం గురంగుల బ్రోచర్లు ప్రింట్ చేయించి భారీగా ప్రచారం చేశారు.

స్థానిక అధికారులకు సైతం అమ్యామ్యాలు ముట్టజెప్పి తమ బిజినెస్ను మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగిస్తోంది. సదరు భారీ వెంచర్ నిర్మాణంలో భాగంగా కొంగలకుంటను మట్టిపోసి పూడ్చివేయడంతో రైతులకు పంట పొలాలు నీరందక బీడు భూములుగా మారే పరిస్థితి కన్పిస్తోంది.

200 ఎకరాలపై పెద్దల కన్ను..

కూనూరు గ్రామపంచాయతీ పరిధిలోని స్మాల్ టానర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి చెందిన భూములను వెంచర్లుగా మార్చి ప్లాట్లుగా విక్రయించడం వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన ఓ లీడర్ ఈ కథ అంతా నడిపిస్తున్నట్టు సమాచారం. దీనికి ప్రతిపక్షబీఆర్‌ఎస్ లీడర్లు సైతం తోడవ్వడంలో రియల్ ఎస్టేట్ దందా మూ డు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

సదరు వెంచర్ ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల వ్యవసాయ భూమిని కొల్లగొట్టి ప్లాట్లుగా చేసేందుకు సదరు ఎమ్మెల్యే సన్నిహితుడు భారీ స్కెచ్ వేశాడు. అందులో భాగంగానే మొదటి విడతలో 13 ఎకరాలను వెంచర్గా మార్చేశాడు. ఒక్కో గజం రూ.8 వేలను రూ.12వేల వరకు విక్రయిస్తూ అమాయక కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఓవైపు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా తీరుతో వందలాది మంది రోడ్లపై కుటుంబాలతో సహా పడ్డారు. అందుకు ప్రధాన కారణం ఎలాంటి అనుమతుల్లేకుండా చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకోవడమే. అయినా అధికారులు మాత్రం అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లపై సవతి ప్రేమ చూపిస్తుండడం గమనార్హం.

అధికారులకు అమ్యామ్యాలు.. సిబ్బందికి బెదిరింపులు..

రాయల్ రిడ్జ్ రిసారట్స్ వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీ లీడర్ల హస్తం ఉండడం.. అమ్యామ్యాలు అప్పజెప్పడంతో అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అయితే సదరు అక్రమ లేఔ్ప స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. వెంచర్లో అడుగుపెట్టిన సిబ్బందిని సదరు ఎమ్మెల్యే సన్నిహితుడు బెదిరిస్తుండడం గమనార్హం. ఓవైపు కొంగలకుంటను పూడ్చేశారంటూ స్థానికులు ఫిర్యాదు చేసినా..

అధికారులు సదరు లీడర్కు భయపడి తూతూమంత్రంగా విచారణ పేరుతో ఇష్యూను క్లోజ్ చేశారు. పేరుకు నాలుగు జెండాలు పీకి.. ఫ్లేక్సీలను తొలగించి చేతులు దులుపుకోవడం కొసమెరుపు. కానీ వెంచర్లో ప్లాట్లుగా మార్చినా రాళ్లను, హద్దు గోడలపై మాత్రం కనీసం చిన్న గీత కూడా పెట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అదే హైడ్రా ఓవైపు రూ.కోట్లు విలువ చేసే విల్లాలు, అపార్ట్మెంట్లను కూకటివేళ్లతో పెకిలించి వేస్తుంటే.. ఇక్కడ మాత్రం అక్రమార్కులకు అధికారులు సపోర్టు చేస్తుండడం విడ్డూరంగా ఉంది.

పట్టించుకోని కలెక్టర్ సాబ్..

ఎక్కడా పని చేసినా.. అక్రమాలపై తనదైన మార్క్ వేసే భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సాబ్.. ఈ వెంచర్ విషయంలో మాత్రం చూసీచూడనట్టు వదిలేస్తు న్నారనే ఆరోపణలు లేకపోలేదు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఇంత జరుగుతున్నా.. నిజంగా కలెక్టర్ సాబ్కి తెలియ దా..? కిందిస్థాయి సిబ్బంది తెలియకుండా మెయింటెన్ చేస్తున్నారా..? లేక మరేదైనా కారణం ఉందా..? అన్న అనుమానాలు లేకపోలేదు.

వాస్తవానికి కలెక్టర్ హనుమంత రావు సాబ్కి విషయం తెలిస్తే.. మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారనే చర్చ మాత్రం ఉంది. ఇప్పటికైనా కలెక్టర్ సాబ్ జోక్యం చేసుని అమాయక కస్టమర్లు నష్టపోకుండా చూడాల్సిన అవసరం ఉందని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.