02-09-2025 05:27:50 PM
హనుమకొండ,(విజయక్రాంతి): వైద్య సేవల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా వడ్డేపల్లిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా ఓపి, గర్భిణీలు, బాలింతలకు సంబంధించిన రికార్డులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. సరిపోల్చి చూసిన అనంతరం రికార్డులలో సమగ్ర వివరాలు నమోదు చేయకపోవడంపై సిబ్బందిని కలెక్టర్ మందలించారు.
ఆరోగ్య కేంద్రంలోని పలు విభాగాలను సందర్శించి వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ ఆరా తీయగా తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ కు ల్యాబ్ టెక్నీషియన్ డిప్యూటేషన్ పై పంపించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య కలెక్టర్ కు తెలియజేశారు. పేషెంట్స్ కు వైద్య పరీక్షలను ఎలా నిర్వహిస్తున్నారని కలెక్టర్ అడగగా వారంలో రెండు రోజులపాటు ( సోమ, శుక్రవారాలు) స్టాఫ్ నర్స్ ద్వారా రక్త నమూనాలను సేకరించి వాటిని తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ కు పంపిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వివరణ ఇచ్చారు.
అదేవిధంగా వడ్డేపల్లిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిర్మిస్తున్న శాశ్వత భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఇంకెంత సమయం పడుతుందని కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, వడ్డేపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మాలిక, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.