28-11-2025 12:00:00 AM
నిజామాబాద్, నవంబర్ 27 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతి ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ను అనుసరిస్తూ నిజామాబాద్ జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్‌లు జారీ చేసి, నామి నేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాలైన బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లితో పాటు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ లోని నవీపేట మండలం పరిధిలోని 184 సర్పంచ్, 1642 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ నేపధ్యంలో నవీపేట మండలం అభంగపట్నం, రెంజల్ మండలం వీరన్నగుట్ట, ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు.
హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా అని తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 27 (విజయ క్రాంతి) : గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని రూమ్ నెం.30లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎం.సీ.ఎం.సీ)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు.
మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసిఎంసి విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ అంకిత్, డీ.పీ.ఓ శ్రీనివాస్ రావు, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.