calender_icon.png 31 December, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదమరిస్తే అంతే!

31-12-2025 01:34:23 AM

ప్రమాదకరంగా మారిన సిరికొండ, రావిపహాడ్ రోడ్డు  

రోడ్డుపై వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు 

మరమ్మత్తులు చేపట్టాలని వేడుకోలు

మోతె, డిసెంబర్ 30 : ప్రజల రవాణాలో ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా చూసేందుకు ప్రభుత్వాలు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేస్తుంటాయి. అయితే వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవి ప్రయాణికుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇటువంటి పరిస్థితి ప్రస్తుతం  మండల పరిధిలోని సిరికొండ రావి పహాడ్ రహదారిలో నెలకొంది. ఈ రహదారిలో అప్పన్న గూడెం, రావిపహాడ్, కూడలి గ్రామాల ప్రజలు  నిత్యం మండల కేంద్రానికి వస్తుంటారు. అయితే సిరికొండ, రావిపహాడ్ మధ్యలో ఏర్పాటు చేసిన బ్రిడ్జి నిర్మాణం గడిసిన ఐదేళ్ల క్రితం నిర్మించారు.

అయితే గత సంవత్సరం విపరీతంగా కురిసిన అతి భారీ వర్షాలతో బ్రిడ్జి సగభాగం దెబ్బతిన్నది. దీంతో పగలు పూట కూడా దగ్గరికి వచ్చే వరకు ఇది కనిపించక పోవడంతో చాలా ఇబ్బకరంగా మారింది. గతంలో ఇదే ప్రదేశంలో అప్పన్న గూడెం, రావిపహాడ్ గ్రామాలకు చెందిన పలువురు ఇక్కడ పది గాయాలపాలైన సందర్భాలు ఉన్నాయి. కొత్తగా ఈ రోడ్ పై ప్రయాణం చేసే వారైతే మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రోడ్డు సగభాగం ధ్వంసం కావడంతో వాహదారులకు అవస్థలు తప్పడం లేదు.

దీంతో ఏ సమయంలో ఏ ప్రమాదం సంభావిస్తుందో అర్ధం కావడం లేదని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికీ రోడ్డుకు పూర్తి స్థాయిలో మరమత్తులు చేయక పోవడంతో రావి పహాడ్, సర్వారం, కూడలి నుంచి వచ్చి పోయే ప్రయాణికులు నలభై కిలోమీటర్ల దూరం నుంచి చివ్వెంల మీదుగా మండల కేంద్రమైన మోతెకు ప్రయాణించాల్సివస్తుంది. అలాగే తుమ్మగూడెం, నర్సింహా పురం, రాయికుంట తండా, ఉర్లుగొండ గ్రామాలకు చెందిన వారు నాయకన్ గూడెం మీదుగా మండల కేంద్రానికి ప్రయాణం చేయాల్సి రావడంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సిరికొండ,రావి పహాడ్ మధ్య ఉన్న రహదారి మరమత్తులు పలు గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. 

రోడ్డుపై ప్రయాణం చేయాలంటే భయం కలుగుతుంది.          

సిరికొండ, రావిపహాడ్ గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి బాగా దెబ్బతినడంతో ఆ దిశలో వెళ్లాలంటే భయం కలుగుతుంది. దగ్గరకు వెళ్ళే వరకు రోడ్ దెబ్బతిన్నది అర్ధం కాదు. దీంతో వేగం వెళ్తే అందులో పడిపోయే ప్రమాదం ఉంది. కావున రోడ్ కు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి.

- బొర్ర సునీల్, సిరికొండ గ్రామస్తుడు

నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడతాం..          

బ్రిడ్జి దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ నిధులు లేనీ కారణంగా  పనులు చేయలేకపోయాం. నిధులు వచ్చిన వెంటనే పనులు వేస్తాము.

- సత్యనాయణ, ఆర్ అండ్ బీ ఏఈ, మోతె.