31-12-2025 01:59:07 AM
మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటలకే బంద్
బార్లు, పబ్‌లు, ఈవెంట్లకు రాత్రి 1 గంట వరకు అనుమతి
తాగి రోడ్డెక్కితే తాట తీస్తాం..
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల వార్నింగ్
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 30 (విజయక్రాంతి): డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగే సెలబ్రేషన్స్ కోసం భాగ్యనగరం ముస్తాబైంది. అయితే, జోష్ హద్దు దాటొద్దని, తాగి రోడ్డెక్కితే తాట తీస్తామంటూ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అదే విధంగా ప్రభుత్వం, మెట్రో అధికారులు కీలక ప్రకటనలు చేశా రు. పార్టీల నుంచి ఇళ్లకు వెళ్లే వారి కోసం మెట్రో వేళలను పొడిగించగా..
మద్యం విక్రయాలు, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎక్సుజ్, పోలీస్ శాఖలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. సాధారణ వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంట ల వరకే తెరిచి ఉంటాయి. 12 దాటిన తర్వా త షాపులు తెరిచి ఉంచితే లైసెన్స్ రద్దుతో పాటు కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. బార్లు, క్లబ్‌లు, స్టార్ హోటళ్లు, ప్రత్యేక అనుమతి పొందిన ఈవెంట్లలో మాత్రం రాత్రి 1 గంట వరకు మద్యం సరఫరా చేయడానికి అనుమతి ఇచ్చారు.
మెట్రోలో ఇంటికి సేఫ్‌గా వెళ్లండి
వేడుకలు ముగించుకుని ఇంటికి వెళ్లే వారి సౌకర్యార్థం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల బారిన పడకుండా ఉండేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సర్వీసులను పొడిగించింది. సాధారణ రోజుల్లో రాత్రి 11 గంటలకే సర్వీసులు ముగుస్తాయి. కానీ డిసెంబర్ 31న రాత్రి 1 గంట వరకు రైళ్లు నడుస్తాయి. మియాపూర్, ఎల్బీనగర్, నాగోల్, రాయదుర్గం వంటి టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 1 గంటకు బయలుదేరుతుంది.
ఇవి గమ్యస్థానాలకు చేరేసరికి రాత్రి 2 గంటలు దాటుతుంది. తాగి వాహనాలు నడిపే బదులు మెట్రోలో సురక్షితంగా ప్రయాణించాలని ఎల్ అండ్ టీ అధికారులు సూచించారు. అయితే, మెట్రోలో న్యూసెన్స్ చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. స్టేషన్లు, రైళ్లలో అదనపు భద్రతా సిబ్బందిని, పోలీసులను మోహరిస్తున్నారు.
రోడ్డెక్కితే ఖబడ్దార్..
న్యూ ఇయర్ జోష్‌లో తాగి వాహనాలు నడిపితే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 రాత్రి నగరవ్యాప్తంగా వందలాది చోట్ల స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు. ప్రమాదాల నివారణకు రాత్రి 10 గంటల నుంచి నగరంలోని ప్రధాన ఫ్లుఓవర్లను బేగంపేట, పంజాగుట్ట మినహా మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పార్టీల కు వెళ్లే వారు సొంత వాహనాల కంటే క్యాబ్‌లు లేదా మెట్రోను ఆశ్రయించడం ఉత్తమమని సూచిం చారు. మొత్తానికి కొత్త సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవాలే తప్ప.. అతిగా ప్రవర్తించి పోలీ సు కేసుల్లో ఇరుక్కోవద్దని అధికారులు నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.