31-12-2025 01:08:27 AM
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృ ష్ట్యా టోల్‌ప్లాజాల వద్ద ‘టోల్ ఫ్రీ వే’కు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలకు 16 నుంచి 18వ తేదీ వరకు ‘టోల్ ఫ్రీ వే’కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
పండుగ పూట లక్షలాది మంది ప్రయాణం చేస్తారని, వారికి ఎలాం టి ఇబ్బంది లేకుండా చూడాలనేది మా ప్ర భుత్వ ఆలోచన అని తెలిపారు. జనవరిలో ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేరొందిన మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని కోరా రు. టోల్ ప్లాజాల వద్ద ఫ్రీగా ఉంటే వాహనాలు ఆగవని, ఎలాంటి అసౌకర్యం ఉండ దని స్పష్టం చేశారు. ఈ విషయంలో అవసరమైతే ఒకటి, రెండు రోజుల్లో తానే స్వయం గా వెళ్లి కలుస్తానని మంత్రి తెలిపారు.
భారీ యంత్రాలతో పనులు వద్దు
పండుగ రద్దీ ఉన్న రోజుల్లో లేన్‌లు మూసే పనులు, భారీ యంత్రాలతో చేసే పనులు వద్దని, అత్యవసరంగా చేయాల్సిన పనులు ట్రాఫిక్ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో మాత్రమే చేయాలని సూచించారు. పండుగ మొదలుకానున్న తేదీకి ముందే రోడ్లపై ఉన్న మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలు పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. అన్ని రహదారి లేన్‌లు వాహనాల రాకపోకలకు పూర్తిగా అందుబాటులో ఉంచాలని, రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట పగలు, రాత్రి స్పష్టంగా కనిపించే ట్రాఫిక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హై-విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, ట్రాఫిక్ వెళ్లే దారి స్పష్టంగా చూపాలని, ఎక్కడా ట్రాఫిక్‌కు అయోమయం కలిగించే ఏర్పాట్లు ఉండ కూడదన్నారు.
అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలి
రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని, ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో స్థానిక పోలీసులతో నిరంతరం సమన్వయం పాటించాలన్నారు. అన్ని సంబంధిత శాఖలు పోలీసుల సూచనలను తప్పనిసరిగా అమ లు చేయాలని, రోడ్డు పనుల్లో ఉన్న సిబ్బంది అందరూ ప్రతిబింబించే జాకెట్లు (పసుపు / నారింజ రంగు) తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
రూట్ పెట్రోల్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉంచాలని, అన్ని రహదారి ఘటన లను ప్రత్యేక ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా సజావుగా వెళ్లేలా అదనపు బృందాలను మోహరించాలని చెప్పారు.
సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు హనుమంత రావు, ఇలా త్రిపాఠి, తేజస్ నందలాల్ పవార్, ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్ అధికారి శివ శంకర్, ఎంఓఆర్‌టీహెచ్ రీజినల్ అధికారి కృష్ణ ప్రసాద్, డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీ, పోలీస్ ఉన్నతాధికారులు, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు జయభారతి, మోహన్ నాయక్, ఎస్‌ఈ ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి
హైదరాబాద్ -- విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహన రద్దీ ఎక్కువ ఉంటుందని, సంక్రాంతికి వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సచివాలయంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.
రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగుతుందని, దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో వేలాది వాహనాలు రద్దీ ఏర్పడుతుందని, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదని స్పష్టం చేశారు.