31-12-2025 01:14:26 AM
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : సంక్రాంతి పండుగ దృష్ట్యా తెలంగా ణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సం క్రాంతి ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పండుగ అయినందున హైదరాబాద్ నుంచి భారీగా ప్రజలు ఏపీకి తరలివెళ్తారు. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ తీవ్రంగా పెరుగుతుంది. దీంతో ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు టోల్ ప్లాజాల వద్ద ఉచితంగా ప్రయాణా నికి అనుమతివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
ఈ మేరకు మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరికీ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భారీ గా వాహనాల రాకపోకలు జరుగుతాయని, ముఖ్యంగా జనవరి 13కు ముందే హైదరాబా ద్ నుంచి విజయవాడ వైపు ట్రాఫి క్ ఒక్క దిశగానే పెరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. ట్రాఫిక్ పెరిగే నేపథ్యంలో టోల్ ఫీజు లేకుం డా ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రం అనుమతించని పక్షం లో నామినల్ పేమెంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభు త్వం స్పష్టం చేసింది. మంత్రి కోమటిరెడ్డి రాసిన లేఖలో పతంగి, కోర్లపహాడ్, చిలకల్లు టోల్ ప్లాజా వద్ద ఫీజు మినహాయించాలని ప్రస్తావించారు. ఈ ప్లాజా గుండా ప్రయాణించే వాహనాల్లో మెజార్టీ ఏపీకి చెందినవే ఉంటాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
200% వరకు ట్రాఫిక్ పెరుగుదల
పంతంగి, కోర్లపహాడ్, చిలకల్లు టోల్ ప్లాజాల వద్ద గత డేటాను పరిశీలిస్తే, సం క్రాంతి సీజన్‌లో సాధారణ రోజులతో పోలి స్తే 200 శాతం వరకు ట్రాఫిక్ పెరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ కారణంగా టోల్ ప్లాజాల వద్ద తీవ్రమైన ట్రాఫిక్ జామ్ లు, గంటల తరబడి ఆలస్యాలు ఏర్పడుతున్నాయని తెలిపింది. రోడ్డు పనులు, బాటిల్ నెక్స్‌తో మరింత ఇబ్బంది ఇప్పటికే రహదారిపై కొనసాగుతున్న పనులు, జంక్షన్లు, జనావాస ప్రాంతాల కారణంగా బాటిల్‌నెక్స్ ఏర్పడి ట్రాఫిక్ మరింత స్థంభిస్తోందని లేఖలో వివరించారు.
ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో రాష్ర్ట ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఏఐ, మోర్త్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేస్తోంది అని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు టోల్ వసూ ళ్లు నిలిపివేసి టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
ఈ ప్రతి పాదన అమలైతే లక్షలాది మంది ప్రయాణికులకు సమయం, ఇంధనం ఆదా అవడమే కాకుండా, రోడ్డు ప్రమాదాల ప్రమాదం కూడా తగ్గుతుందని రాష్ర్ట ప్రభుత్వం అభిప్రాయపడింది. సంక్రాంతి వేళ కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
వాహనాలు.. వసూళ్లు..
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ రహదారిపై టోల్ ప్లాజాల వాహనాలు, ఫీజులు గమనిస్తే.. 2023లో జనవరి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పతంగి టోల్‌ప్లాజా వద్ద 3,98,780 వాహనాలకు గానూ రూ. 5,06,64,500, కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద 2,69,645 వాహనాలకు గానూ రూ. 4,71,73,260, చిలకల్లు టోల్ ప్లాజా వద్ద 1,95,967 వాహనాలకు గానూ రూ. 3,05,65,895 వసూలు అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.
అదే విధంగా 2024లో పతంగి వద్ద 4,27,560 వాహనాలకు గానూ రూ. 4,71,14,025, కోర్లపహాడ్ వద్ద 2,92,891 వాహనాలకు గానూ రూ. 5,63,81,980, చిలకల్లు వద్ద 2,08,425 వాహనాలకు గానూ రూ. 3,10,18,825, 2025లో పతంగి వద్ద 4,86,272 వాహనాలకు గానూ రూ. 6,57,05,415, కోర్లపహాడ్ వద్ద 3,10,446 వాహనాలకు గానూ రూ. 6,12,59,135, చిలకల్లు వద్ద 2,33,848 వాహనాలకు గానూ రూ. 3,43,95,530 వసూలు అయ్యాయి. మొత్తంగా 2023లో మూడు ప్లాజా వద్ద కలిపి రూ. 12.84 కోట్లు, 2024లో రూ. 13.45 కోట్లు, 2025లో రూ. 16.13 కోట్లు ఫీజుల రూపంలో వసూలు అయ్యాయి.
ఏపీ మెప్పు పొందేందుకేనా?
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి కోరుతూ, టోల్ వసూళ్ల భారం రాష్ర్ట ప్రభుత్వమే భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం తెలంగాణ ప్రజల ప్రయోజనాలకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మెప్పు పొందేందుకే తీసుకున్నదా? అనే ప్రశ్నలు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి. టోల్ ఫ్రీ అమలైతే ఎక్కువ లాభం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వాహనదారులకే చేకూరుతుందని, అయితే టోల్ ప్లాజాల నష్టాన్ని తెలంగాణ ఖజానా భరించాల్సి వస్తుందని విమర్శకులు అంటున్నారు.
ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్న రాష్ర్టం ఇలాంటి నిర్ణయంతో మరింత భారం మోస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి వేళ టోల్ ఫ్రీ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించినప్పటికీ, దీని వెనుక రాజకీయ లెక్కలు దాగి ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజల్లో సానుకూలత పొందాలన్న ప్రయత్నంలో తెలంగాణ ప్రయోజనాలు పక్కనపడ్డాయన్న వాదన ముందుకు వస్తోంది.
తెలంగాణ వాహనదారులకు లాభమెంత..?
సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ ప్లాజా వద్ద ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశానికి కేంద్ర అనుమతించకపోతే నామినల్ పేమెంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం టోల్ ప్లాజా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోనే ఉన్నప్పటికీ కేంద్ర అనుమతించకపోతే మొత్తం టోల్ ఫీజు కొంతమేర అయినా తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
టోల్ ఫీజు భారం తెలంగాణ ప్రభుత్వం భరిస్తామంటున్న నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే వారిలో పెద్ద శాతం ఏపీకి వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే వాహనాలేనన్న వాదనను విమర్శకులు ప్రస్తావిస్తున్నారు. అలా అయితే టోల్ ఫ్రీ వల్ల నిజంగా తెలంగాణ ప్రజలకు ఎంత మేరకు ప్రయోజనం కలుగుతుందన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.