15-10-2025 12:33:26 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(jubilee hills bypoll) బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్(Maganti Sunitha Files Nomination) బుధవారం నామినేషన్ వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, దీదీప్య రావు, సమీనా యాస్మిన్‌తో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదన్నారు. పదేళ్ల అభివృద్ధికి, రెండు సంవత్సరాల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నికని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. తమ ఇళ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని, కాంగ్రెస్ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ నగర పేదలు ఆశగా ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. గులాబీ దండు జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం అవ్వాలన్నారు. రెండు సంవత్సరాల ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ మాగంటి సునీత గోపీనాథ్ కి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల మద్దతుతో, అండతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించబోతోందని కేటీఆర్ సూచించారు.