calender_icon.png 15 October, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిటీ హాల్ స్థలంపై కన్నేసిన నగరం మేయర్

15-10-2025 12:12:09 PM

భర్త బంధువుల పేరిట కొత్త సొసైటీ రిజిస్టర్         

బగ్గు మంటున్న పద్మశాలి సమాజం     

హనుమకొండ,(విజయక్రాంతి): గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించిన రెండు ఎకరాల భూమిని పథకం ప్రకారం నగర మేయర్ గుండు సుధారాణి తన భర్త ప్రభాకర్ ను ముందు పెట్టి కులానికి సంబంధించిన కమ్యూనిటీ స్థలంపై కన్నేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నగర మేయర్ గుండు సుధారాణి(Mayor Gundu Sudharani) గతంలో నక్కలగుట్ట ల్యాండ్ మార్క్ వెనకాల పార్కు స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం తన సొంత కులం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పద్మశాలి కులస్తుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిర్మించాలని సంకల్పంతో హనుమకొండ జిల్లా అసంపర్తి మండలం చింతగట్టులోని సర్వే నెంబర్ 146/2.,155/1  లో మొత్తం రెండెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగింది.

గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రంజిత్ కుమార్ ప్రభుత్వ ఆదేశాల మేరకు 2021 ఫిబ్రవరి 10న మెమో నంబర్.8730/LA/A2/2020-2. తో ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కథలుగా భావించిన నగర మేయర్ గుండు సుధారాణి తన భర్త గుండు ప్రభాకర్ అధ్యక్షుడిగా అల్లుడు అనిల్ కుందారపును ట్రెజరర్ గా పెట్టి  పద్మశాలి సంఘం పేరిట కొత్త సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధ్యక్షుడిగా డీఎస్ మూర్తి, ప్రధాన కార్యదర్శి గోరంటల రాజు ఉన్నారు. అయినా తన మెహర్బానిని ఉపయోగించి కొత్త సొసైటీ కి ఆజ్యం పోశారు. పద్మశాలి సంఘం నేతలతో మాట్లాడకుండానే వారికి ఏ విషయం తెలియకుండా మేయర్ ఏకపక్షంగా 2021 ఫిబ్రవరి 18న తన సన్నిహితులు ఏడుగురు సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించి 112/2021 తో 15/8/ 41 ఇంటి నెంబర్ ను  రామన్నపేట లో ఆఫీసు అడ్రస్ గా చూపిస్తూ, తన భర్త గుండు ప్రభాకర్ కు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి 2021 జులై 14 హసన్పర్తి ఇరిగేషన్ సబ్ డివిజన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేత ఈ రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని తన భర్త గుండు ప్రభాకర్ కు అధికారికంగా అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా పద్మశాలి కుల సంఘం నేతలను బాధ్యతలు ఇవ్వకుండా గుర్తు చప్పుడు కాకుండా ఏకంగా రెండెకరాల భూమిని తన భర్త ప్రభాకర్ పేరిట భూ బదలాయింపు చేసిన విషయం తెలిసి పద్మశాలి సంఘం నేతలు బగ్గుమంటున్నారు. తన రాజకీయ ఎదుగుదలకు కుల సంఘాలు కీలక పాత్ర పోషించాయని పలు సమావేశంలో చెప్పిన సుధారాణి, మేయర్ పదవి చేపట్టాక కులస్తులను శత్రువుగా చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. హనుమకొండలో పద్మశాలి కమ్యూనిటీ హాల్ కోసం ప్రభుత్వం రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయిస్తే మేయర్ తన సొంత జాగీర్ అనుకుని ఏడుగురితో పేపర్ పై కమిటీ వేసి రిజిస్టర్ చేయించడం  ఎంతవరకు సమంజసం అని పద్మశాలి కుల పెద్దలు ప్రశ్నిస్తున్నారు. త్వరలో పద్మశాలి సంఘం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి నిజాలను బహిర్గతం చేయాలని పద్మశాలి కులస్తులు  డిమాండ్ చేస్తున్నారు.